Jul 27,2023 21:35

వరహాలగెడ్డలో పూడికతీతలను పరిశీలిస్తున్న కమిషనర్‌ రామప్పలనాయుడు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : వర్షాకాలం దృష్ట్యా వరహాల గెడ్డ ప్రవహిస్తున్న పరిధిలో బైపాస్‌ రోడ్డు దగ్గర ఉన్న రైల్వే లైన్‌ వద్ద ఉన్న ఏడు ఖానాల కింద రైల్వే మూడో లైన్‌ నిర్మాణంలో భాగంగా మట్టితో పాటు చెత్తలు, వ్యర్ధాలు పేరుకుపోయాయి. దీంతో గురువారం 50 ప్రైవేటు కార్మికులతో జరుగుతున్న పూడికతీతల పనులను మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడు మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారి జి. ఆనంద్‌, ప్రజారోగ్య అధికారి సిహెచ్‌. మురళితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని, వర్షం నీటితో పాటు, వాడుక నీరు వరహాల గెడ్డలో చేరడం వల్ల బైపాస్‌ కాలనీ ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ పూడికతీత పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.