రాజంపేట అర్బన్ : విద్య, ఉద్యోగ అవకాశాలు పొందాలన్నా, రాజకీయ రంగంలో రాణించాలన్నా ఎస్సీ వర్గీకరణ అవసరమని, వర్గీకరణకు తోడ్పడే అన్ని శక్తులను ఏకం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించడమే అంతిమ లక్ష్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు మందకష్ణ మాదిగ తెలియజేశారు. సోమవారం పట్టణంలోని జిఎంసి కళ్యాణమండపంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997 జూలై 7న వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించి నేటికి 29 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇందుకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పి, ఎంఇఎఫ్ వంటి అనుబంధ సంఘాలు వేదికగా నిలిచాయని అన్నారు. మాదిగలు ఇతర పార్టీల అగ్రకులాల నాయకుల వద్ద గులాంగిరి మాని జాతి భవిష్యత్తును నిలిపే వర్గీకరణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారతంలో 2020 వరకు వర్గీకరణ లేని కారణంగా 50 సంవత్సరాల పాటు రాజ్యాంగ ఫలాలను ఇతర కులాలు అనుభవించాయని, 2000 సంవత్సరంలో టిడిపి ప్రభుత్వంలో ఏ బి సి డి వర్గీకరణ పొంది కేవలం 5 ఏళ్లలోనే మాదిగలు 22 వేల ఉద్యోగాలు పొందారని తెలిపారు. వర్గీకరణ లేని 50 సంవత్సరాలలో కేవలం 18 వేల ఉద్యోగాలు మాత్రమే పొందగలిగారని తెలిపారు. వర్గీకరణను రద్దు చేస్తూ 2004లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత 19 ఏళ్లుగా మాదిగలు ఎస్సీ వర్గం లోని ఇతర కులాల కంటే అన్ని రంగాలలోనూ అత్యంత దారుణంగా వెనుకబడ్డారని అన్నారు. మాల మహానాడు అధ్యక్షులు జూపూడి ప్రభాకర్ రావు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్సీ పదవి, టిడిపి హయాంలో ఎంపీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ సెల్ అధ్యక్షులుగా పదవులు పొందారని చెప్పారు. తాను మాదిగల అభ్యున్నతి కోసం పదవులను తచ్చ ప్రాయంగా వదిలివేశానని చెప్పారు. జాతిని గెలిపించడానికి జీవితకాలం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, పలుకుబడి లోనూ మాలలు అధిక సంఖ్యలో ఉంటే మాదిగలు ప్రతి చోటా వెనకబడ్డారని ఆవేదన చెందారు. వర్గీకరణకు కట్టుబడే పార్టీకే మాదిగలు సహకరించాలని, మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉనికిని కాపాడుకోవడానికి ఆత్మస్థైర్యంతో అలుపెరగని అవిశ్రాంత పోరాటం చేసి వర్గీకరణ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు వెలగచర్ల శివయ్య, వెంబడి రాధాకష్ణ, చేమూరు వెంకటేష్, మందా శివయ్య, మందా శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లాలలోని ఎంఎస్‌పి, ఎంఇఎఫ్, ఎంఆర్‌పిఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న మందకష్ణమాదిగ










