Apr 01,2023 00:20

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి : తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని మాదిగలకు హామీ ఇచ్చిన బిజెపి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆ మాటే మరిచిందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు కొల్లి చిన్న అప్పారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నమ్మకద్రోహానికి నిరసనగా శుక్రవారం కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం జిల్లా ఇన్చార్జ్‌ ఏలుసూరి ఘాటీలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకులు ఆరుగుళ్ళ రాజబాబు, అనకాపల్లి నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు కట్టమూరు మంగరాజు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ చేసి పార్లమెంటుకు పంపినట్టే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ చేసి పార్లమెంటుకు పంపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిఆర్‌వో వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక మల్లి బాబు, ఎత్తుల అప్పారావు, చెవ్వేటి నాగరాజు, ఎం సతీష్‌, కొల్లి రామాంజి, కాకినాడ కనకేశ్వరరావు, గొట్టివాడ సామ్రాట్‌ కుమార్‌, కనక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.