- ఎంపిపి కారం లక్ష్మి
ప్రజాశక్తి-విఆర్.పురం
వరదల సమయంలో ఇబ్బంది లేకుండా ముందుస్తుగా విద్యుత్ సమస్యలపై ఆ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీపీ కారం లక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గోదావరి వరదల సమయంలో నెలల తరబడి ఏజెన్సీ గ్రామాలు నీట మునిగి, విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో ఉండవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదలు వస్తే మళ్లీ అటువంటి ఇబ్బందులే పడాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని చింతూరు నుంచి కుందులూరు మీదుగా పెద్దమట్టపల్లి, రేకపల్లి వరకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. చింతూరు నుండి కుందులూరు మీదుగా గతంలో ఒక లైన్ ఉండేదని, దాని ద్వారా కుందులూరు నుండి వరద ముంపునకు గురైన ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ రేఖపల్లి మండల కేంద్రం వరకు కరెంటు ఇచ్చేవారని, దాని వల్ల వరదలు వచ్చినా విద్యుత్ సప్లై ఉండేదని పేర్కొన్నారు. వరదల కాలంలో విద్యుత్ సరఫరాకు వీలుగా ఈ లైన్‌ను పునరుద్ధరించాలని కోరారు. చిన్న గాలి దుమారం వచ్చినా కరెంటు అంతరాయం తరచుగా కలుగుతుందని, ఈ లోపాలను సరిచేయాలన్నారు. వరదలు ఎదుర్కోవటానికి విద్యుత్ శాఖ పూర్తిగా సన్నద్ధం కావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, ఎపి గిరిజన సంఘం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి, సర్పంచ్ పులి సంతోష్ కుమార్, మండల కమిటీ సభ్యులు పంకు సత్తిబాబు, కారం సుందరయ్య, సోడి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.










