ప్రజాశక్తి-కాకినాడ గోదావరి, ఇతర నదులు ఉధతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. శుక్రవారం తాడేపల్లి సిఎ9ం క్యాంపు కార్యాలయం నుంచి సిఎం వైఎస్.జగన్, హోమ్, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, డిజిపి కెవి.రాజేంద్రనాథ్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, జెసిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఎస్‌ఫి ఎస్.సతీష్ కుమార్ వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. వరద ప్రభావ ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు, ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు, నిత్యవసర సరుకులు పంపిణీ, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల అమలు, వరద తగ్గాక చేపట్టాల్సిన పంట నష్టం వివరాల నమోదు వంటి అంశాలపై ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విసి అనంతరం ఇన్‌ఛార్జి కలెక్టర్ ఇలక్కియ జిల్లాలోని పరిస్థితిపై అధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, వ్యవసాయం, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి, సిపిఒ పి.త్రినాథ్, ఆర్ అండ్ బి ఎస్‌ఇ కె.హరిప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.










