Jun 08,2023 23:15

ప్రజాశక్తి - పెద్దాపురం వరదలపై ముందస్తుగా సమాచారం తెలుసుకుని ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించే పరికరాన్ని రూపొందించిన దివిలి కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్‌ రాజేష్‌, పి.జగదీశ్వరరావును కిట్స్‌ చైర్మన్‌ బేతినీడి శ్రీనివాసరావు అభినందించారు. గురువారం కళాశాలలో జరిగిన అభినందన సభలో డాక్టర్‌ సూరిబాబు మాట్లాడుతూ వరదలపై ముందస్తుగా సమాచారం తెలుసుకోవడంతో పాటు వరదలు వచ్చినప్పుడు నదులలో సంభవించే ప్రమాదాలను అరికట్టడంలో రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించి ఈ పరిశోధన జరిగిందన్నారు. ఎయుఐపిఆర్‌ చైర్మన్‌ డాక్టర్‌ హనుమంత్‌ పురుషోత్తం సహకారంతో డాక్టర్‌ పి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో పరిశోధనా నిపుణులు డాక్టర్‌ రాజేష్‌, డాక్టర్‌ సూరిబాబు బందం ఈ పరికరాన్ని రూపొందించిందన్నారు. ఈ పరికరానికి భారత ప్రభుత్వం పేటెంట్‌ హక్కులు మంజూరు చేసిందన్నారు. ఈ పరికరం ప్రమాదాన్ని ముందుగా పసికట్టడంతో పాటు తీవ్రతను తెలియజేస్తుందన్నారు. కళాశాల చైర్మన్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ అధ్యాపకులు ఈ పరికరాన్ని రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సభలో ఇఒ జెన్నిబాబు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఇ.సర్వరామేశ్వరుడు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.