కోమటిలంక - కైకలూరు మధ్య నిలిచిన రాకపోకలు
కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ పరిశీలన
ప్రత్యేక బోటు ఏర్పాటు
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
బుడమేరు, రామిలేరు నుంచి వరద నీరు వచ్చి కోమటిలంక ఆటపాక మద్య మట్టిరోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సోమవారం పరిశీలించారు. కోమటిలంక నుంచి కైకలూరు ప్రయాణానికి ఆటంకం లేకుండా తాత్కాలికంగా ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ద్వారా ప్రత్యేకమైన బోటు సౌకర్యం కల్పించామని చెప్పారు. ఈ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించి అప్రమత్తతో వ్యవహరించాలని ఆదేశించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల కొల్లేరు అభయారణ్యం పరిధిలోని కోమటిలంక, ఆటపాక మధ్య మట్టిరోడ్డు కొట్టుకుపోయిందన్నారు. అయితే కోమటిలంకలో 450 కుటుంబాలున్నాయని, వారు ఆటపాకకు విద్య, ఇతర కార్యకలాపాల కోసం వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకమైన బోటు సౌకర్యం కల్పించామని తెలిపారు. గోదావరి వరదల వల్ల పెద్దబోటు ఆక్కడ ఉందని వరద ఉధృతితగ్గిన వెంటనే ఆ బోటును ఇక్కడకు తీసుకొస్తామన్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఈ ప్రాంతంలో కల్వర్టు గానీ, పైపులైన్లు వేయడం ద్వారా గానీ తిరిగి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి వరకు గ్రామస్తులు సహకరించాలన్నారు. ప్రయివేటు పడవలు ద్వారా రక్షణ చర్యలు లేకుండా ప్రజలను తరలించడం ప్రమాదకరమన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రెస్క్యూ బృందం సహకారంతో మాత్రమే ప్రయాణం చేయాలన్నారు. ఇందుకు గ్రామ సర్పంచి, గ్రామప్రజలు తమ సహకారం అందిస్తామని తెలిపారన్నారు. ఈ ప్రాంతంలో విఆర్‌ఒ, ఆర్‌ఐ పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్థానిక సర్పంచి, ఇతర అధికారులకు తెలపాలని ఆదేశించారు.










