Aug 03,2023 23:04

హిరమండలంలో బ్యారేజీకి దిగువన కోతకు గురైన వరద గట్టు (ఫైల్‌)

- గతేడాది గొట్టాబ్యారేజీ దిగువన కోతకు గురైన గట్టు
- హిరమండలంలో రెండేళ్ల కిందట వంశధారకు గండి
- తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్న ప్రభుత్వం
- శాశ్వత ప్రాతిపదికన పనులకు నిధులు కేటాయించిన వైనం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
వంశధారకు వరద వస్తే అధికారుల్లో గుబులు రేగుతుంది. హిరమండలం మండలంలోని గొట్టాబ్యారేజీ వద్ద గతేడాది ఆగస్టులో వరదలు వచ్చిన సందర్భంగా బ్యారేజీ దిగువన వరద గట్టు కోతకు గురైంది. అంతకుముందు ఏడాది గొట్టాబ్యారేజీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఎలుకల మెట్ట వద్ద కొంతమేర గట్టు కొట్టుకుపోయింది. శాశ్వత ప్రాతిపదికన పనులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల చేయకపోవడంతో, అధికారులు తాత్కాలికంగా కొంతమేర పనులు చేపట్టారు. వంశధారకు 80 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే మళ్లీ ఈ సమస్యలు పునరావృతమవుతాయని అధికారులు ఆందోళన చెందున్నారు. కాలువకు గండ్లు పడితే తమ పొలాలు ముంపునకు గురవుతాయంటూ మరోవైపు రైతులు కలవరపడుతున్నారు.
కోతకు గురవతున్న కాలువ గట్లు
వంశధారకు 80 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిన సందర్భంతో గతేడాది ఆగస్టులో హిరమండలం బ్యారేజీ దిగువ భాగాన కొంతమేర వరద గట్టు కోతకు గురైంది. గట్టుకు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.10 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వంశధార కాలువ గట్లు ఎంత బలహీనమో 2021 జూలై 15న హిరమండలం వద్ద ఎడమ కాలువ కోతకు గురవ్వడం పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు మట్టి నానిపోవడంతో గొట్టాబ్యారేజీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎలకల మెట్ల సమీపంలో కొంత గట్టు కొట్టుకుపోయింది. అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టినా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
బ్యారేజీ వద్ద దెబ్బతిన్న అప్రాన్‌
హిరమండలం మండలం గొట్టాబ్యారేజీ వద్ద 0.612 టిఎంసిల సామర్థ్యంతో 1977లో బ్యారేజీ నిర్మించారు. బ్యారేజీ ఎగువ భాగంలో ఎడమవైపున 3.6 కిలోమీటర్లు, కుడివైపు 6.2 కిలోమీటర్ల మేర వరద కట్ట నిర్మించారు. బ్యారేజీకి ఆనుకుని దిగువ, ఎగువ భాగంలో 11.06 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్‌ బ్లాక్‌లతో దృఢమైన అప్రాన్‌ను నిర్మించారు. అప్రాన్‌కు సపోర్టుగా పెద్ద పెద్ద బండరాళ్లను కట్టగా పేర్చారు. 2008, 2010 ఆగస్టులో వచ్చిన వరదలతో అప్రాన్‌ క్రమేణా దెబ్బతింటోంది. బ్యారేజీ దిగువ భాగంలో తాత్కాలికంగా మూడు మీటర్ల మేర రాళ్లను వేశారు. బ్యారేజీ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో 2012, మార్చి 26న రూ.3.48 కోట్లతో 2014 మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత వచ్చిన వరదలకు మరోసారి బండరాళ్లు కొట్టుకుపోయాయి. 2015లో హైదరాబాద్‌ నుంచి సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ నుంచి వచ్చిన చీఫ్‌ ఇంజినీరు సర్వే చేసి అదే ఏడాది మేలో తనిఖీ నివేదిక సమర్పించింది. బ్యారేజీ దిగువ భాగంలో అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన అప్పటి ప్రభుత్వం రూ.9.72 కోట్లు కేటాయిస్తూ 2017 ఫిబ్రవరి ఏడో తేదీన ఉత్తర్వులను వెలువరించింది. అప్పట్నుంచి పనులు చేపట్టకుండా పాలకులు నాన్చుతూ వచ్చారు.
సాగునీటిపై ప్రభావం
హిరమండలం గొట్టాబ్యారేజీ ద్వారా వంశధార కుడి, ఎడమ కాలువల కింద 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఇందులో ఎడమ కాలువ ద్వారా 1.70 లక్షల ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80 వేల ఎకరాలకు నీటిని అందించాల్సి ఉంది. కాలువల పరిస్థితి దయనీయంగా ఉండడంతో నిర్ధేశించిన ఆయకట్టుకు నీరందడం లేదు. ముఖ్యంగా శివారు భూములకు నీరందని పరిస్థితి ప్రతిఏటా పునరావృతమవుతోంది. సాగునీటి కాలువలు చాలా బలహీనంగా ఉండడం, కాలువల్లో పెద్దఎత్తున గుర్రపుడెక్క పేరుకుపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వంశధార ఎడమ కాలువ సామర్థ్యం 2,450 క్యూసెక్కులు కాగా కాలువ గట్లు బలహీనంగా ఉండడంతో 1800 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది. కుడి కాలువ సామర్థ్యం 800 క్యూసెక్కులు కాగా 500 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది. తోటపల్లి పాత రెగ్యులేటరీ వ్యవస్థ ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌లో వీరఘట్టం, పాలకొండ పరిధిలోని 27,410 ఎకరాలకు సాగు నీరందించాలని అధికారులు లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. కాలువ పూర్తిస్థాయి సామర్థ్యం 414 క్యూసెక్కులు కాగా, అందులో మూడో వంతు నీటిని కూడా విడిచిపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి.