
కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
వరద తాకిడికి గురైన ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఆర్‌డిఒ, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలతో సమావేశమై పలు అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరద తాకిడి మంగళవారం నాటికి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉందని, మెడికల్ క్యాంపులను రెండు రోజులపాటు కొనసాగించాలని చెప్పారు. పశు దాణాను పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ అధికారిని ఆదేశించారు.
యలమంచిలి, ఆచంట, నరసాపురంలలో 23 లోతట్టు గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. 11 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, 25 మెడికల్ క్యాంపులను నిర్వహించినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి ఐదు టీములను, 40 లైఫ్‌జాకెట్స్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. 15 ఇంజిన్ బోట్లను, ఎనిమిది కంట్రీ బోట్లను మొత్తం 23 బోట్లను సిద్ధం చేశామన్నారు.
పెండింగ్‌లో వన్ టైం సెటిల్‌మెంట్ పత్రాలు
పెండింగ్‌లో ఉన్న వన్ టైం సెటిల్‌మెంట్ పత్రాల రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. సిసిఆర్‌సి కార్డులు జారీలో భీమవరం, అత్తిలి, తాడేపల్లి మండలాలు నూరుశాతం జారీ పూర్తి చేసినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.