ప్రజాశక్తి-కూనవరం
వరదల్లో మునిగి నష్టపోయిన ఇళ్లకు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అందించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కూనవరం సచివాలయం ఎదుట శనివారం ధర్నా చేశారు. అనంతరం పంచాయతీ ఇన్‌ఛార్జి ఇఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య మాట్లాడుతూ జులై, ఆగష్టు నెలలో వచ్చిన వరదలకు నష్టపోయిన వరద బాధితులకు ఇంటికి రూ.10వేలు ఇస్తామన్న ముఖ్యమంత్రి, నేటికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందకపోతే సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతా రామయ్య, నాయకులు తాళ్లూరి శ్రీనివాసరావు, యడ్ల వెంకన్న బాబు, జక్కుల వీరబాబు, షణ్ముఖ రావు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










