రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ సంవత్సరం 10 రోజుల తేడాలో రెండు సార్లు తుఫాన్లు, వరదలు రావడంతో రాష్ట్రం అతలాకుతలమైంది. కృష్ణా, గోదావరి దాని ఉపనదులు పొంగిపొర్లాయి. ఈ వరదలకు కృష్ణా నుండి 1000 టిఎంసిలు, గోదావరి నుండి 3500 టిఎంసిలు నీరు వృధాగా సముద్రంలో కలిసింది. మన రాష్ట్రానికి నిరంతరం తుఫాన్లు, వరదల ప్రమాదం పొంచి వుంది. గత 45 సంవత్సరాలలో 60 సార్లు తుఫాన్లు వచ్చాయి. ఎక్కువ భాగం అక్టోబరు, నవంబరులో వస్తుంటాయి. పంటలు చేతికొచ్చే సమయమది. ఈ సంవత్సరం తుఫానుతోపాటు పైనుండి వరదలు రావడం వల్ల దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. వరి, పసుపు, అరటి, తమలపాకు, చెరకు, కంద, కూరగాయలు తదితర పంటలు నీటిపాలయ్యాయి. ఆక్వా చెరువులు మునిగిపోయాయి. రూ. 5 వేల కోట్ల పైన నష్టం వాటిల్లింది. అసలే కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆదాయాలు లేక అవస్థ పడుతున్న ప్రజానీకానికి గోరుచుట్టుపై రోకటిపోటు లాగా వరదలు దాపురించాయి. కౌలు రైతులు కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఇది వ్యవసాయ రంగం పైనే కాకుండా పట్టణ ప్రాంతాలపై కూడా ప్రభావం చూపింది.
కర్ణాటక, మహారాష్ట్రలలో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నుండి నీరు వదలడంతో దిగువ ప్రాంతాలకు మొదటిసారి వరదలొచ్చాయి. రెండోసారి సాగర్ దిగువన మూసీ, పాలేరు, మున్నేరు తదితర నదుల నుండి వచ్చిన వరద చుట్టుముట్టింది. మూసీ వరదల వల్ల హైదరాబాద్ నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. డ్రైనేజీలు మునిగిపోయి అనేక ప్రాంతాల్లో ఇళ్ళల్లోకి కూడా నీరు ప్రవేశించింది. పడవల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తున్నది. ఈ నీరే కృష్ణా నదిలో కలుస్తున్నది. ఒక వైపు కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించుకునే ప్రయత్నం జరుగుతుండగా మరోవైపు అందుకు తగిన ప్రాథమిక సౌకర్యాలు లేనందున అదనపు జలాలను కుందు నది ద్వారా పెన్నా లోకి వదిలారు. ఈ నదికి సరైన గట్లు లేవు. దానితో నీరు పొంగిపోయి 30 గ్రామాల పొలాలను ముంచెత్తింది. కర్నూలు, కడప జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. కడప జిల్లా గండికోట ప్రాజెక్టు పునరావాసం పూర్తి కానందున 22 గ్రామాల్లో వేలాది కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. మొత్తం 9000 కుటుంబాలకు గాను 5700 కుటుంబాలకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టు సామర్ధ్యం 23 టిఎంసిలు కాగా 12 టిఎంసిలకు మించి నింపితే పునరావాసం పూర్తి కాని గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి. వీరికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో కూడా బాధితులకు పూర్తి నష్టపరిహారం ఇవ్వనందున ఆ గ్రామాలకు కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి వుంది. కృష్ణా బ్యారేజి వద్ద రాజధాని ప్రాంతంలో వరదలు రాకుండా నివారించేందుకు కొండవీడు వాగుపై లిఫ్టులు పెట్టారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాటిని సకాలంలో పనిచేయించనందున పొలాల్లోకి నీరు చేరుకున్నాయి. బ్యారేజి దిగువన విజయవాడ పట్టణంలోని కరకట్ట కింద ఉన్న కాలనీలన్నీ మునిగిపోయాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని దాదాపు 50 లంక గ్రామాలు మునిగిపోయాయి. అక్కడ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో పంటలు సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ ఇతర పేద రైతులకు గతంలో ఏక్ సాల్ పట్టాలు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు హయాంలో వాటిని కొనసాగించలేదు. జగన్ మోహన్ రెడ్డి వచ్చాక పునరుద్ధరించనూ లేదు. దాంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు.
రాయలసీమ, ప్రకాశం వంటి జిల్లాల్లో వర్షాలు లేక కరువుతో పంటలు దెబ్బ తింటే ఈ సంవత్సరం అధిక వర్షాలకు పంటలు నాశనమయ్యాయి. మెట్ట ప్రాంతాల్లో వేరుశనగ, పత్తి, మిర్చి దెబ్బతిన్నాయి. అతివృష్టి, అనావృష్టి రెండూ వెనుకబడిన ప్రాంతాలకు శాపాలుగా మారాయి. గోదావరి మీద నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రణాళికా లోపం వల్ల మునక గ్రామాల్లోని ఆదివాసీ ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి అక్కడ నెలకొని ఉంది. పునరావాసం కోసం ఎంపిక చేయబడ్డ గ్రామాలకు వాస్తవంగా మునుగుతున్న గ్రామాలకు సంబంధం లేదు. ఇప్పటికే నిర్మించిన పునరావాస కాలనీలు సైతం మునకలో ఉన్నాయి. దానికితోడు ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే పూర్తి చేయకుండానే తొందరపడి కాఫర్ డ్యాం నిర్మించడం వల్ల చిన్న చిన్న వరదలకు కూడా బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి తోసుకొస్తున్నది. భద్రాచలం దగ్గర వరద హెచ్చరికల కొలమానానికి వాస్తవంగా నీరు చేరుతున్న స్థితికి సంబంధం తెగిపోయింది. కాంటూర్‌ల అమరిక మారిపోయింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి వరదలకు పలు లంక గ్రామాలతో సహా అనేక ప్రాంతాలు మునిగిపోతున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలువ, తమ్మిలేరు గట్లు తెగి పంటలు మునిగిపోతున్నాయి.
వ్యవసాయానికి జరిగిన నష్టంలో అత్యధిక మంది బాధితులు కౌలు రైతులే. వారికి ఎలాంటి రక్షణా లేదు. నిబంధనలు మార్చి వాస్తవ సాగుదార్లయిన కౌలుదార్లకు పరిహారం అందించకపోతే లక్షలాది కుటుంబాలు వీధులపాలు కావడమే కాదు, వ్యవసాయానికే కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
వరదలకు భారీ వర్షాలు, నదులు పొంగి ప్రవహించడం, పట్టణాల్లోను, పంటపొలాల్లోను డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, పంట కాలువలు సరిగ్గా నిర్వహించకపోవడం తక్షణ కారణాలు. విచక్షణా రహితంగా రియల్ ఎస్టేట్ విస్తరించడంతో పొలాల మధ్య నీరు పోయే మార్గం లేక పంట పొలాలు మునిగిపోతున్నాయి. అడవులు నశించిపోవడం, అభివృద్ధి పేరుతో చెట్లను నిర్మూలించడం, కొత్తగా వనాలు పెంచకపోవడం...వరదలు, నేల కోసుకుపోవడం, భూసారం దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. తుఫాను వచ్చినపుడు గాని, వానతోపాటు సముద్రం పొంగి నదీ జలాలు వెనక్కి తోసుకొస్తున్నాయి. సకాలంలో వరద సమాచారం ప్రజలకు అందకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతోంది. తరచుగా వరదలు వస్తున్నా ఎప్పటికప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు చేయడం మినహా శాశ్వత చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల కష్టాలు, నష్టాలు పెరగడమే కాకుండా రాష్ట్రాభివృద్ధి కూడా కుంటుపడుతున్నది.
వరద యాజమాన్య పద్ధతులను మెరుగుపర్చడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడించాలి. గత 25 సంవత్సరాల్లో నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. వాతావరణ శాస్త్రం అభివృద్ధి అయింది. భారీ వర్షాలు, తుఫానులు వచ్చే గమనాన్ని ముందుగానే కనుగొనగలుగుతున్నారు. ఇదే రకమైన టెక్నాలజీ వరద నియంత్రణకూ ఉపయోగించుకోవచ్చు. బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వరదల రాకపోకలను ముందస్తుగానే అంచనా వేయవచ్చు. అయితే దీనికి క్షేత్ర స్థాయిలో సమన్వయం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం ఎంతైనా అవసరం. ఉదాహరణకు హైదరాబాద్‌లో ముంచెత్తిన వరదలు కృష్ణా నదికి చేరడానికి ఎంత సమయం పడుతుందీ అంచనా వేసి ముందస్తు నివారణా చర్యలు తీసుకోవచ్చు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల నీటి లెక్క సకాలంలో అందుబాటులో ఉంటే ఆంధ్రలో వరద నష్టాన్ని తగ్గించుకోవచ్చు. మనుషుల ఇన్‌ఫర్మేషన్‌తో నిమిత్తం లేకుండా మిషన్లే లెక్కలు వేసి హెచ్చరిక చేసే సాంకేతిక వ్యవస్థ ఇది. వరదలు తట్టుకునే విధంగా కాలువ గట్లను పటిష్టం చేయాలి. ఉదాహరణకు విజయవాడ కరకట్ట కింద రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తే ఆ ప్రాంతాల్లోని పేద ప్రజలకు రక్షణ కలుగుతుంది. లాభాపేక్షతో ఇష్టానుసారం ఇసుక క్వారీలు తవ్వడం వల్ల నదీ మార్గాలు గాడి తప్పి గట్లు కోసుకుపోతున్నాయి. కాలువ, డ్రైనేజి నిర్మాణాల్లో అవినీతి కూడా వరదలు పెరగడానికి దోహదపడుతున్నది. కాలువలు, డ్రైనేజీలలో తూటుకాడ పెరగడం, ఫ్యాక్టరీ మలినాలు చేరడం, అక్రమంగా తవ్విన ఆక్వా చెరువులు కూడా వరదలకు కారణమవుతున్నాయి. వరదలు, తుఫాన్లు ప్రకృతి సిద్ధంగా అనివార్యమైనప్పటికీ వాటిని సకాలంలో నియంత్రించగలిగితే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించుకోవచ్చు. ఇందుకు అవసరమైన విధానాలు, పట్టుదల ప్రభుత్వానికి ఉండాలి. నిధుల కేటాయింపు జరగాలి.
రాష్ట్రంలో వరద సహాయ కార్యక్రమాలు సంతృప్తికరంగా జరగడం లేదు. గత సంవత్సరం ప్రకటించిన పరిహారం కూడా ప్రజలకు అందలేదు. ఈ సంవత్సరం జరిగిన నష్టాన్ని ఇంతవరకూ ఎన్యూమరేషన్ చేయలేదు. నష్టపరిహారమూ ప్రకటించలేదు. వరద నివారణకు శాస్త్రీయ పద్ధతిలో దీర్ఘకాల చర్యలు తీసుకోవడంతోపాటు తక్షణం ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు యుద్ధ ప్రాతిపదికపై సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రాజకీయ దూషణ భూషణల మధ్య మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయరాదు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కేంద్రం ఉదారంగా సహాయం చేయాలి. కాని గత అనుభవం దృష్ట్యా కేంద్రం మన రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన న్యాయమైన నిధులను రాబట్టాలి. అందుకు అఖిల పక్షాలు, ప్రజల సహకారం తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
(వ్యాసకర్త సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు)
వి. శ్రీనివాసరావు










