Jul 27,2023 21:16

తగ్గుతూ.. పెరుగుతూ.. పరుగులు పెట్టిస్తున్న గోదావరి
జల్లేరు, తమ్మిలేరు, ఎర్రకాల్వ ప్రాజెక్టులకు పోటెత్తిన వరద
కివ్వాక పునరావాస కాలనీకి కుక్కునూరు ఎ బ్లాక్‌ నిర్వాసితులు
భద్రాచలం వెళ్లే బస్సులు కుక్కునూరు వరకే
ప్రమాదపుటంచున లంక గ్రామాలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

            గోదావరి వరద ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. తగ్గుతూ..పెరుగుతూ గోదావరి వరద ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలను, పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని లంక గ్రామాల ప్రజలను భయపెడుతోంది. ఏజెన్సీలోని తమ్మిలేరు, జల్లేరు ప్రాజెక్టులకు పెద్దఎత్తున చేరుతున్న వరదనీరు దిగువ గ్రామాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. గడిచిన వారం రోజులుగా జిల్లాను వర్షాలు వెంటాడుతున్నాయి. దీనికితోడు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉరకలు వేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఒక్కరోజులో 51 అడుగులకు చేరడంతో అంతటా ఆందోళన నెలకొంది. గురువారం కొంత తగ్గుముఖం పట్టి 48 అడుగులు చేరినప్పటికీ పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళన రేకెత్తిస్తూనే ఉంది. పోలవరం ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 34 మీటర్లు దాటింది. దీంతో దిగువకు 11.78 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరదకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో కుక్కునూరు ఎ బ్లాక్‌కు చెందిన దాదాపు 200 కుటుంబాలు గురువారం కివ్వాక పునరావాస కాలనీకి తరలివెళ్లాయి. ఇప్పటికే గొమ్ముగూడెం, రేపాకగొమ్ము గ్రామాలకు చెందిన ప్రజలు రావికుంట పునరావాస కాలనీకి చేరారు. కుక్కునూరు మండలంలో కౌండిన్యముక్తి గ్రామంతోపాటు, వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల ప్రజలను గురువారం పునరావాస కాలనీలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ గోదావరి తగ్గుముఖం పట్టడంతో తాత్కాలికంగా ఆ ప్రక్రియ నిలిపివేశారు. దాచారం, కుక్కునూరు, ముత్యాలంపాడు, వింజరం, సీతారాంనగరం, శ్రీధర్‌ గ్రామాల మధ్య కాజ్‌వేలు నీట మునగడంతో 20 గ్రామాలకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలేరు, బూర్గంపాడు మధ్యలో ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం వెళ్లే బస్సులు కుక్కునూరు నుంచి వెనక్కి తిరుగుముఖం పడుతున్నాయి. వరద భయంతో ఏజెన్సీ ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. కాపర్‌డ్యామ్‌ ప్రభావంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతున్న తీరు అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
జల్లేరు, తమ్మిలేరు, ఎర్రకాల్వ ప్రాజెక్టు దిగువ గ్రామాలకు వరద హెచ్చరికలు
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌కు పెద్దఎత్తున వరద నీరు చేరుతోం ది. దీంతో దిగువకు నీరు విడుదల చేయాల్సి ఉంటుందని, ప్రాజెక్టు దిగువన ఉన్న చింతలపూడి, లింగపాలెం, పెదవేగి, చాట్రాయి, ముసునూరు మండలాల రెవెన్యూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులు హెచ్చరించారు. తమ్మిలేరు రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం 345 అడుగులకు వరద నీరు చేరింది. ప్రస్తుతం 3,600 క్యూసెక్కుల నీరు వచ్చిపడుతోంది. దీంతో ఏక్షణానైనా గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల చేయనున్నారు. ఏజెన్సీలోని జల్లేరు రిజర్వాయర్‌ ప్రాజెక్టుకు, ఎర్రకాల్వ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వస్తోంది. దిగువకు నీరు విడుదలచేస్తే జంగారెడ్డిగూడెం, బుట్టాయ గూడెం మండలాల తోపాటు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, భీమవరం, తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలు ప్రాంతాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. జల్లేరు ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 217 మీటర్లు. ప్రస్తుతం 215 మీటర్లకు వరదనీరు చేరింది. ప్రస్తుతం 238 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వస్తోంది. తమ్మిలేరు ప్రాజెక్టు నుంచి వరదనీరు దిగువకు విడుదల చేస్తే జిల్లా కేంద్రం ఏలూరును సైతం వరద నీరు చుట్టు ముట్టనుంది. దీంతో ఏలూరు నగర ప్రజల్లోనూ గుబులు నెలకొంది.