ప్రజాశక్తి-విఆర్.పురం
గోదావరి వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం విమర్శించారు. ముంపు మండలాల్లోని వరద బాధితులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ రంపచోడవరం జిల్లా కమిటీ సమావేశంలో సీతారాం, మరో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ భయానక గోదావరికి వరద వచ్చి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడితే ఎవరికీ సరైన సహాయం చేయకపోగా, ఇచ్చిన హామీలను సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు. వరద బాధితులకు రూ.10వేలు చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి ఆరు నెలలు గడిచినా నేటికీ అందివ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ కాలంలో వ్యవసాయ కార్మికులు, రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై స్పష్టత లేదని, గిరిజనులకు ఇచ్చే భూమికి భూమి ఎక్కడా చూపలేదని తెలిపారు. ఇంకా వరదలు కాలం నాలుగు నెలలే ఉండగా, ఇప్పటి వరకు పునరావాసం కల్పించలేదని, ఇళ్లు పూర్తి కాలేదని పేర్కొన్నారు. మళ్లీ వరదలు వస్తే ఇక్కడి ప్రజలకు మరో సారి ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వం వెంటనే ఉన్న ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మరో వైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదివాసీలను తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. గిరిజనులకు రక్షణగా ఉన్న చట్టాలను సవరిస్తూ కార్పొరేట్లకు అడవులను ధారాదత్తం చేసే కుట్ర చేస్తుందని తెలిపారు. జిఒ నెంబర్ 3ను సుప్రీం కోర్టు రద్దు చేసి రెండున్నరేళ్లు అయినా నేటికీ దాని పునరుద్ధరణకు, దానికి చట్టబద్దత కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రం బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రంప చోడవరం జిల్లా కార్యదర్శి బొప్పిన కిరణ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంజ సీతారామయ్య, లోత రామారావు, వాణిశ్రీ, జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, ముళ్లపాటి నాగేశ్వరరావు, నక్కల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, కూనవరం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, ఎటపాక మండల కార్యదర్శి ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










