Aug 05,2023 00:06

మాట్లాడుతున్న టిడిపి మండల అధ్యక్షులు ప్రకాశరావు

ప్రజాశక్తి-కూనవరం
వరద బాధితులకు తక్షణ సాయం కింద ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.2000 ఇవ్వడానికి కూడా పలు ఆంక్షలు పెట్టడం దుర్మార్గమని టిడిపి మండల అధ్యక్షులు బరపాటి ప్రకాశరావు అన్నారు. దీని వల్ల అర్హులైన ప్రజలకు చాలా మందికి వరద సాయం అందడం లేదన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ అర్హులందరికీ వరద సాయం అందకపోవడంపై వాలంటీర్లను అడిగితే హౌస్‌ మ్యాపింగ్‌లో ఉండాలని, రేషన్‌ కార్డ్‌ ఉండాలని, ఒకవేళ ఇవన్నీ ఉన్నా వాళ్ళు స్థానికంగా ఉండాలని సమాధానం చెబుతున్నారని తెలిపారు. వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇచ్చే తక్షణ సహాయానికి కూడా ఇన్ని నియమ నిబంధనలు అవసరమా? అని ప్రశ్నించారు. తల్లిదండ్రులతో వేరుపడిన కొడుకుల కుటుంబాలకు వేరుగా రేషన్‌ కార్డు ఉన్నా కూడా ఒకరికి మాత్రమే రూ.2వేలు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రతి దానికీ ఏ ఒక వంక పెట్టడం దారుణమన్నారు. గోదావరి వరద ముంపునకు గురైన ఇళ్లను సర్వే చేసి తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని, రూ.2000 తక్షణ సాయం విషయంలో ఎటువంటి కారణాలు చూపించకుండా అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యులు ఎండి.షరీఫ్‌, తెలుగు యువత అధికార ప్రతినిధి గడేసుల రంజిత్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు బండారు శివయ్య పాల్గొన్నారు.