వరద బాధితులకు సిఎం ప్రకటించిన తక్షణ సాయం రూ.10వేలు చెల్లించాలి
గోదావరి వరదల్లో ముంపునకు గురై సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణ సాయం కింద ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.10వేలు చెల్లించాలని, ఇళ్లు, పంటలు, పశువులు నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన పోలవరం విలీన నాలుగు చింతూరు, ఎటపాక, విఆర్.పురం, కూనవరం మండలాల్లో బుధవారం ధర్నాలు నిర్వహించారు.
ప్రజాశక్తి- చింతూరు
సిపిఎం ఆధ్వర్యాన చింతూరు ఐటిడిఎ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంజా సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్, మండల కార్యదర్శి సిసం సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తక్షణ సహాయం రూ.10వేలు ప్రకటించి నాలుగు నెలలైనా నేటికీ పరిహారం అందకపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని విమర్శించారు. మండలంలోని చిడుమురు, కల్లేరు, ముకునూరు గ్రామాల్లో ముంపు కుటుంబాలను కొన్నింటిని మాత్రమే గుర్తిస్తున్నారని, అన్ని కుటుంబాలను బాధ్యత లిస్టులో చేర్చి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముర్రం లక్ష్మి, మాజీ సర్పంచ్ మడకం శేషయ్య, కంగల రంగయ్య, సోడె చిన్నమ్మి, మడకం గిరిజా, వరద బాధితులు పాల్గొన్నారు.
ఎటపాక : సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఐవి, నాయకులు డేగల మాధవరావు మాట్లాడుతూ జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నాలుగు దఫాలు వచ్చిన గోదావరి వరదల కారణంగా వరి, పత్తి వంటి పంటలు నీట మునిగాయని, అనంతరం వర్షాలతో ప్రత్యామ్నాయ పంటలు వేయలేక రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు లేక వ్యవసాయ కూలీలు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఇరపా అజరు, ఐ.పద్మ, ఆకిశెట్టి రాము, గద్దల హుస్సేన్, బుద్దుల భద్రయ్య, సవలం రాము వరద బాధితులు పాల్గొన్నారు.
విఆర్.పురం : మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయం నుండి తహశీల్దారు కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా జులై వరదల్లో ముంపునకు గురైన అన్ని గ్రామాలను ముంపు జాబితాల్లో చేర్చి ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదలకు కొట్టుకుపోయిన అన్నవరం వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి నిధులు మంజూరు చేయాలని, పెద్దమటపల్లి బిటి రోడ్డు పనులను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దారు శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు పంపు సత్తిబాబు, కారం సుందరయ్య, కారం సత్తిబాబు, సత్యనారాయణ, శ్రీరామ్మూర్తి, కాంతారావు, చిక్కాల రామారావు, దారయ్య, ఎంపీపీ కారం లక్ష్మి, రేఖపల్లి, రామవరం, పెద్దమటపల్లి, ములకనపల్లి సర్పంచ్‌లు పూనెం సరోజినీ కారం బుచ్చమ్మ, వెట్టి లక్ష్మి, సవలం మారయ్య అధిక సంఖ్యలో వరద బాధితులు పాల్గొన్నారు.
కూనవరంలో...
విఆర్.పురం : వరద బాధితులకు, నష్ట పరిహారం, వర్షాల వల్ల బీడు భూములుగా మారిన వ్యవసాయ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ఎంపిడిఒ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల వల్ల ఇంత నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. తక్షణమే పరిహారం చెల్లించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తమ్మయ్య, నాగరాజు వెంకన్నబాబు, వీరబాబు షణ్ముఖరావు, పొద్దయ్య, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.










