వరద బాధితులకు సిఎం ప్రకటించిన రూ.10వేలు ఆర్థికి సాయం తక్షణమే ఇవ్వాలి
ప్రజాశక్తి-చింతూరు
జులై నెలలో వరదలకు సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించిన నాలుగు నెలలైనా నేటికీ బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. శనివారం మండలంలోని ఎర్రంపేట రచ్చబండ సెంటర్లో మొట్టుము రాజయ్య అధ్యక్షతన జరిగిన సిపిఎం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్వాసిత ప్రాంత అభివృద్ది, ఇక్కడ ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరం ముంపులో ఉన్న ప్రజానీకానికి పునరావాసం, పరిహారం చెల్లించే వరకు మీ వెంటే ఉంటానని వాగ్దానం చేసి ముఖం చాటేయడం దుర్మార్గమన్నారు. వరదల అనంతరం ప్రజలు జ్వరాలు, జబ్బులతో మృతి చెందుతుంటే కనీసం మందులు, డెంగీ నిర్ధారణ కిట్లు కూడా ఇవ్వలేదని, డెంగీతో మృతి చెందినా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. చింతూరు డివిజన్‌గా ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేయాలని, ముంపు గ్రామాలకు ప్రత్యామ్నాయ రహదారులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి బి.కిరణ్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య, లౌకికవాద హక్కులను హరిస్తుందని, నేడు కేరళలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే ప్రధాన లక్ష్యంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులను బిజెపి వస్తువులుగా కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను నీరుగారిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కుంజా సీతారామయ్య, మండల కార్యదర్శి సీసం సురేష్, నాయకులు పల్లపు వెంకట్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, మల్లం సుబ్బమ్మ, పోడియం లక్ష్మణ్, కారం నాగేష్, మడకం చిన్నయ్య, కారం సుబ్బారావు, కారం కొండయ్య, పాండ్రమ్ సుబ్బారావు, సోడా చిన్నమ్మి, సోడా రెడ్డి, సవలం నారాయణ తదితరులు పాల్గొన్నారు.










