ప్రజాశక్తి - వేలేరుపాడు
వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గోదావరి వరద బాధితులను జిల్లా టిడిపి ఆధ్వర్యంలో పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు మాజీ ఎంఎల్‌ఎ చింతమనేనీ ప్రభాకర్, ఏలూరు నియోజకవర్గం ఇంఛార్జి బడేటి రాధాక్రిష్ణయ్య, పొలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు కలిసి పరామర్శించారు. అనంతరం ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుట్టాయగుడెం మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గోదావరి వరదల వలన వెలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం ఏదో తూతూమంత్రంగా సహాయక చర్యలు తప్ప పూర్తి స్థాయిలో న్యాయం చేయటం లేదని తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు ఇచ్చి, పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిర్వాసితులను ఆదుకోవాలని, ప్యాకేజీలు అందించి పునరావాస కాలనీలకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యంట్రప్రగడ శ్రీనివాస్, జిల్లా తెలుగురైతు కార్యదర్శి గద్దె అబ్బులు, జిల్లా అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యా సాగరిక, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, కుందుల శ్రీను, కోఆర్డినేటర్ మనెల్లి బాలు పాల్గొన్నారు.










