Oct 16,2022 23:52

సమావేశంలో మాట్లాడుతున్న నాగేశ్వరరావు

ప్రజాశక్తి -విఆర్‌ పురం: గోదావరి వరదల్లో ఇళ్లు, పంటలు, ఇతర ఆస్తులను నష్టపోయిన ముంపు బాధితులందరికీ ప్రభుత్వపరంగా పరిహారమిచ్చి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం కూనవరం మండలంలోని రేపాకలో ఎం.బుజ్జి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ విసృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ, జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చిన భారీ వరదలకు వేలల్లో నిరాశ్రయులై సర్వం కోల్పోతే, పరిహారం చెల్లింపు విషయానికి వచ్చేసరికి వందల సంఖ్యల్లోనైనా బాధితులను లెక్కించకుంఆ ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని విమర్చించారు. వరదలు, తుపానుల తర్వాత ఒకవైపు వ్యవసాయం సాగక, మరోవైపు ఉపాధి లేక ప్రజలు విలవిల్లాడుతుంటే, ఇళ్లు నష్టపోయిన బాధితులకు పరిహారమివ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేయడం చేతకానితనమని ఎద్దేవా చేశారు. వరదనీటిలో రోజుల తరబడి మునిగి, ఇంటా, బయటా పెద్దఎత్తున బురద పేరుకపోవడంతోపాటు తీవ్రనష్టం వాటిల్లి, వాటిని నానాకష్టాలు పడి బాధితులు బాగుచేసుకుంటే, ఇపుడు అన్ని ఇళ్లకు పరిహారం ఇవ్వలేమనడం సమంజసం కాదన్నారు. ఇళ్లు, పంటలను నష్టపోయిన వరద బాధితులందరికీ పూర్తిస్థాయి పరిహారమిచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఎం జోగయ్య లక్ష్మణరావు పాల్గొన్నారు.
19న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా
జయప్రదానికి సిపిఎం పిలుపు
విఆర్‌.పురం:
గోదావరి వరద నష్టాలపై రీసర్వే నిర్వహించి, నష్టపోయిన ఇళ్లు, పంటలు, ఇతర ఆస్తులకు న్యాయపరిహారం ఇవ్వాలని కోరుతూ ఈ నెల 19న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ, మండల కార్యదర్శి స్వయం చిన్నబాబు తెలిపారు. ఆదివారం రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో పంపు సత్తిబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, గోదావరి ముంపు బాధితులందరికీ పరిహారం, పనరావాస ప్యాకేజీ కల్పించాలని కోరారు. నీట మునిగిన ఇళ్లకు 1.50లక్షల నష్టపరిహారం, ఎకరా పంటకు రూ.3.85లక్షలుతోపాటు పునరావాసం కింద రూ. పది లక్షల ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముంపు మండలాల్లోని అన్నిగ్రామాలను 4.15 కాంటూర్‌ చేర్చాలని కోరారు. ప్రస్తుత వరదల్లో ముంపుబారిన పడిన బాధితులరదరికీ పూర్తి పరిహారం, పునరావాస ప్యాకేజీ చెల్లించేంతవరకు పోలవరం నిర్మాణాన్ని ఆపాలన్నారు. ముంపు ప్రభావం లేని ప్రాంతంలో పునరావాస కాలనీ నిర్మించాలని కోరారు. జూలైలో వచ్చిన గోదావరి వరదల్లో నష్టపోయిన ఇళ్లకు, పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈఏడాది వరద బాధితులకు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందకపోవడం దారుణమని, అలాగే వరద తదనంతర పరిస్థితుల్లో బురదతో క్షీణించిన పారిశుధ్యం, దోమల బెడదతో జ్వరాలు విజృంభించి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తమను ఆదుకోవాలన్న ముంపు బాధితుల ఆక్రందనలు ప్రజాప్రతినిధులు, అధికారుల చెవికి చేరకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.పోలవరం నిర్వాసితులు, వరద బాధితుల సమస్యలపై ఈ నెల 19న మండల కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను పార్టీలకు అతీతంగా హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంతోష్‌ కుమార్‌, ఎంపిటిసి ప్రదీప్‌ కుమార్‌, సవలం మారయ్య, మండల నాయకులు శ్రీరామమూర్తి, గూటాల శ్రీనివాసరావు, తుర్రం బాబురావు పాల్గొన్నారు.