మండల పరిషత్తు సమావేశంలో ప్లకార్డులతో నిరసన
ప్రజాశక్తి-కూనవరం
ఈ ఏడాది గోదావరి వరదలు కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేలు పరిహారం చెల్లించాలని వైస్ ఎంపిపి డిమాండ్ చేశారు. స్థానిక మండల పరిషత్తు సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశం జరుగుతుండగా సిపిఎం ప్రజాప్రతినిధులు ప్లకార్డులు పట్టుకుని వరద బాధితులకు న్యాయం చేయాలలని నిరసన తెలిపారు. సమావేశ మందిరం బయట సిపిఎం ఆధ్వర్యాన ఆందోళన చేసి ఎంపిడిఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపిపి పెంటయ్య మాట్లాడుతూ గోదావరి వరదలకు మండలంలోని అన్ని గ్రామాలు నష్ట పోయాయని, ఆ రోజు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ప్రతి కుటుంబానికి రూ.10వేలు చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారని, ఆరు నెలలైనా నేటికీ చెల్లించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల నాగేశ్వరరావు, పాయం సీతారామయ్య, తాళ్లూరి శ్రీను, సీనియర్ నాయకులు నాగరాజు, సిపిఎం ఎంపిటిసిలు కారం జయసుధ, అమ్మాజీ, వెంకమ్మ శంకర్, నాగమణి, జక్కుల వీరబాబు, జనసేన ఎంపిటిసి సాంబశివ తదితరులు పాల్గొన్నారు.










