ప్రజాశక్తి-విఆర్.పురం
జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చిన వరదలతో దెబ్బతిన్న ఇళ్ళకు, పలు రూపాల్లో నష్టపోయిన బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో పంకు సత్తిబాబు అధ్యక్షత మంగళవారం నిర్వహించిన సమావేశంలో బొప్పన కిరణ్ మాట్లాడుతూ వరదల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొని సర్వం కోల్పోయిన బాధితులకు ఇళ్ల నష్ట పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం కాలయాపన ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. సర్వేలు పేరుతో అధికారులు హడావుడి చేయడం తప్పా ఆచరణ ఏమీ ఉండటం లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు గతంలో లక్షా 15 వేలు రూపాయలు ఇచ్చిన భూములకు రూ.3.85 లక్షలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభలు మర్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, వారికి న్యాయం జరిగే వరకు సిపిఎం పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చినబాబు, ఎంపిపి కారం లక్ష్మి, ఎంపీటీసీ ప్రదీప్ కుమార్, సర్పంచ్‌లు పులి సంతోష్ కుమార్, గూటాలు శ్రీనివాసరావు, వెట్టి లక్ష్మి, పూనెం సరోజిని, కారం బుచ్చమ్మ, నాయకులు కుంజా నాగిరెడ్డి, కదల కొండయ్యరెడ్డి, తుర్రం బాబురావు, సున్నం పార్వతి, కమ్మచిచ్చు సత్యనారాయణ, గుండిపూడి లక్ష్మణరావు, తాతబాబు, ప్రకాష్, చిక్కాల రామారావు, సోడి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.










