Aug 07,2023 00:14

దెబ్బతిన్న దొంటకాయల తోట

ప్రజాశక్తి- విఆర్‌.పురం
గోదావరి వరదలు కారణంగా ముంపునకు గురైన చింతూరు డివిజన్‌లోని విఆర్‌.పురం, కూనవరం, ఎటపాక, చింతూరు మండలాల్లోని బాధితుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. 15 రోజుల పాటు కొండలపైనా, గుట్టలపైనా ఇబ్బంది పడ్డ బాధితులను ప్రభుత్వం గాలికొదిలేదిలేసింది. రెండు మూడు రకాల కూరగాయలు, రూ.2వేలు చేతులో పెట్టి తమ పని అయిపోయినట్లు చేతులు దులుపేసుకుంటుంది.
గోదావరి, శబరి నదులు ఉప్పొంగడంతో జులై 20వ తేదీన నుండి 15 రోజుల పాటు అడవుల్లోనూ, రోడ్లమీద, స్కూల్‌ భవనాల వద్ద గుడారాల్లోనూ, పునరవాస కేంద్రాల్లోనూ కరెంటు లేక దోమలు, విషపురుగుల మధ్య బాధితులు కాలం వెల్లబుచ్చారు. నిత్యావసరాలు కూడా సరిగా ఇవ్వకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ఉధృతి తగ్గిన తరువాత గ్రామాలకు వచ్చిన బాధితులను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. కేవలం తక్షణ సాయం కింద రూ.2వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. గ్రామాలు మునిగిన, గ్రామాలకు చుట్టూ నీరు చేరిన అన్ని గ్రామాల్లోనూ ప్రతి కుటుంబానికీ రూ.10వేలు ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు. వరద సమయంలో తమ సామగ్రిని ఇంటి నుండి పునరావాస కేంద్రాలకు తరలించడానికి, వరద తగ్గిన తరువాత ఇంటికి తిరిగి తెచ్చుకోవడానికి రూ.20వేలు వరకు ఖర్చు కాగా, ఆ మొత్తం ప్రభుత్వం చెల్లించడం లేదు. ఈ నెల 8న ముఖ్యమంత్రి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బాధితులను ఆదుకొనేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ముంపు మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ వరద నష్టాన్ని వెంటనే ఎన్యూమరేషన్‌ చేయించాలని, ఆస్తి నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలని, వ్యాధులు ప్రబలకుండా తక్షణమే వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నారు. ముప్పుకు గురైన కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ బ్లీచింగ్‌ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దెబ్బతిన్న కూరగాయల పంటలు
మండలంలోని ఒడ్డుగూడెం, రాజుపేట గ్రామాల్లో దొండ, చిక్కుడు, బెండ వంటి కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చిన సమయంలో గోదావరి వరదలు కారణంగా 15 రోజుల పాటు పంట ముంపులో ఉండిపోవడంతో పూర్తిగా నాశనమైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు పోవడంతో ఎకరానికి రూ.60 వేలు వరకు రైతులకు నష్టం వాటిల్లింది. మండలంలోని రాజుపేట కాలనీ గ్రామానికి చెందిన ముంజుపు పోసిబాబు, ముంజపు పోసి ప్రసాద్‌, ముత్యాల శివాజీలు 7 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేయగా, ఆ మొత్తం పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయల పంట పండిస్తూ జీవనం సాగిస్తున్నామని, వరదలకు పంటలు దెబ్బతిన్నా అధికారులు ఇంతవరకు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి పంట నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.