Sep 23,2023 20:54

వీక్లీ రౌండప్‌


వరాలివ్వని సిఎం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించారు. తొలుత కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద 77 చెరువులకు నీటిని నింపే పథకాన్ని స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. అనంతరం నంద్యాల జిల్లా డోన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సిఎం ఎలాంటి వరాలూ ఇవ్వలేదు. ఎలాంటి హామీలనూ సిఎం తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. కేవలం చెరువులకు నీళ్ళు నింపే అంశానికే ప్రసంగాన్ని పరిమితం చేశారు. చంద్రబాబు మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతే గానీ జిల్లాకు సంబంధించిన వేదవతి, నగరడోణ, జొలదరాసి వంటి పెండింగ్‌ ప్రాజెక్టులను ఏమి చేస్తారో ఒక ముక్క కూడా చెప్పలేదు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతామని పాతపాటే పాడారు. వివాదాలతో పనులు ఆగిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు సాగుతున్నట్లు చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి వేదిక మీద అడిగిన అంశాన్ని కూడా ముఖ్యమంత్రి అసలు పట్టించుకోలేదు. డోన్‌లో హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ ఏర్పాటు చేయాలని బుగ్గన తన ప్రసంగంలో పేర్కొన్నారు. దానిపైనా సిఎం ఏ మాత్రమూ స్పందించలేదు. ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి జిల్లా సమస్యలను పట్టించుకోలేదు. దీనిపై ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అలా వచ్చి ఇలా వెళ్లినట్లు ముఖ్యమంత్రి పర్యటన ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఘనంగా గణనాథుల నిమజ్జనం
ఈ వారంలో జిల్లాలో గణనాదులు కొలువు దీరారు. జిల్లాలో కొన్ని మండలాల్లో మూడు రోజుల పాటు గణనాధులకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంతో పాటు మరి కొన్ని మండలాల్లో ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించి ఘనంగా నిమజ్జనం చేశారు.
ఐదు మండలాల్లో కురిసిన వర్షం.. మరికొన్ని మండలాల్లో ఎండుతున్న పంటలు..
ఈ వారంలో జిల్లాలోని ఐదు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు మహానంది, సంజామల, రుద్రవరం, పగిడ్యాల మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఖరీఫ్‌ ప్రారంభంలో కాస్త వర్షాలు పడటంతో రైతులు విత్తనాలను విత్తారు. ఆ తరువాత వరుణుడి జాడ కనిపించడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు పంటలు ఎండిపోయాయి. మరో వైపు వర్షాభావం వల్ల కొందరు రైతులు పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు కంటే పంటల సాగు తగ్గింది. 56 శాతం మాత్రమే పంటలు సాగయాయ్యి.
జిల్లాలో యుటిఎఫ్‌ ప్రచార జాతా..
యుటిఎఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా చేపట్టిన ప్రచార జాతా జిల్లాలో సాగింది. కర్నూలు జిల్లా నుండి నంద్యాల జిల్లాలోకి ప్రవేశించిన జాతా పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ మీదుగా సాగింది. అనంతరం జాతా కడప జిల్లాలోకి ప్రవేశించింది. జాతాలో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.