ప్రజాశక్తి-సింహాచలం: సింహాచల దేవస్థానానికి పవిత్రమైన వరాహ పుష్కరణిలో నిత్యం కలకలలాడే చేపలు కొద్దిరోజులుగా మండుతున్న ఎండలకు మృతిచెందుతున్నాయి. శనివారం చాలా చేపలు చనిపోయాయి. చెరువు కిరువైపులా ఒడ్డుకు వచ్చి పడిఉన్నాయి. ఐదు రోజులు కావస్తున్నా దేవస్థానం అధికారులు చెరువులో చనిపోయిన చేపలను తొలగించకపోవడంతో దుర్వాసన ప్రారంభమైంది. మంగళవారం అమ్మవారి పండక్కి వచ్చిన బంధువులు, స్థానికులు ఈ దుర్వాసనతో తీవ్ర అవస్థలు పడ్డారు. స్వామి వారి దర్శనానికి వచ్చే గ్రామీణ ప్రాంత భక్తులు పుష్కరణిలో స్నానమాచరించి కొండపైకి వెళ్తుంటారు. ఈ దుర్వాసన భరించలేక పుష్కరణిలో స్నానం చేయకుండానే ముక్కులు మూసుకుంటూ ఈ చెరువులోని నీరు చల్లుకొని స్వామి దర్శనానికి వెళ్లడం కనిపిస్తోంది. దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి చెరువులో చనిపోయిన చేపలను వెంటనే తొలగించి దుర్వాసన లేకుండా చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.










