Oct 03,2022 00:08

వన్యప్రాణి వారోత్సవాలను ప్రారంభిస్తున్న డిఎఫ్‌ఒ అనంతశంకర్‌

ప్రజాశక్తి - ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల, అటవీశాఖ ఆధ్వర్యాన వన్యప్రాణి వారోత్సవాలు ఆదివారం జూ పార్కులో అటవీశాఖ అధికారి అనంత శంకర్‌, జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా ప్రారంభించారు. బర్డ్‌వాక్‌లో భాగంగా విద్యార్థులు, జంతు ప్రేమికులు జూ ప్రధాన ద్వారం నుంచి జూ చుట్టూ తిరుగుతూ పలు జాతుల పక్షులను వీక్షిస్తూ వాటి గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూ కెమెరాల్లో బంధించారు. ఈ సందర్భంగా అటవీశాఖాధికారి అనంత శంకర్‌ మాట్లాడుతూ వన్య ప్రాణులు, వాటి సంరక్షణ గురించి తెలుసుకోవడానికి ఈ వారోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా మాట్లాడుతూ, మన చుట్టూ ఉండే చిన్న జీవజాతులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.