Dec 31,2022 00:01

టేకు చెట్లకు కొలతలు వేస్తున్న శ్రీకాంతనాథ్‌రెడ్డి, అటవీశాఖ అధికారులు

విశాఖ అటవీశాఖ కన్జర్వేటర్‌ శ్రీకాంతనాథ్‌రెడ్డి
ప్రజాశక్తి-సీలేరు

వన్యప్రాణులు అంతరించిపోకుండా వాటిని సంరక్షించడానికి పగడ్బందీగా రక్షణ చర్యలు చేపడుతున్నామని విశాఖపట్నం అటవీశాఖ కన్జర్వేటర్‌ శ్రీకాంతనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇటీవల విశాఖ అటవీ శాఖ కన్జర్వేటర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంతనాథ్‌రెడ్డి శుక్రవారం సీలేరు రేంజ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీలేరు అటవీ రేంజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫారెస్ట్‌లో వన్యప్రాణులు సంరక్షణ ఏ విధంగా ఉంది? పులులు సంచారం ఉందా? ఉంటే కెమెరాలతో వాటిని ఎలా గుర్తించాలి అనే కోణంలో రక్షణ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఒడిస్సా నుంచి ఇటీవల రెండు పులులు అల్లూరి సీతారామరాజు జిల్లా ఫారెస్ట్‌ పరిధిలోకి వచ్చాయని, అందులో ఆడ, మగ ఉన్నాయని తెలిపారు. అవి ఫారెస్ట్‌ చివరి గ్రామాల్లో సంచరిస్తూ కాకినాడ, రాజమండ్రి సర్కిల్‌ వైపు వెళ్లి మళ్లీ వస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని పేర్కొన్నారు. వాటిని టైగర్‌ ట్రాకింగ్‌ టీములుగా ఏర్పాటు చేసి గుర్తించగా పాడేరు రభ అనే బీట్‌ ఏరియాలో సంచరిస్తున్నట్లు నివేదిక వచ్చిందని వెల్లడించారు. విజయనగరం జిల్లా అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయని ఎప్పటికప్పుడు తమ సిబ్బంది ఆనవాళ్లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అల్లూరి జిల్లా ఏర్పడిన తర్వాత చింతపల్లి అటవీ డివిజన్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఈ డివిజన్‌లో సిబ్బంది, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. బోడ కొండమ్మ గుడి పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అటవీ శాఖ ముందుకొచ్చిందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని డిఎఫ్‌ఓను ఆదేశించినట్లు తెలిపారు. సరుగుడు వాటర్‌ ఫాల్స్‌ ఏరియా మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉండగా చుట్టుపక్కల ఉన్న భూమి రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు గుర్తించమని చెప్పారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరిస్తామని ముందుకొచ్చారని పేర్కొన్నారు.
సీలేరు రేంజ్‌లో విస్తృత పర్యటన
సీలేరులో అటవీ రేంజ్‌ పరిధిలో శ్రీకాంతనాథ్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. సీలేరు సమీపంలోని వలసిగడ్డ టేక్‌ ప్లాంటేషన్‌ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ రేంజ్‌ కార్యాలయం చుట్టుపక్కన ఉన్న టేకు మారజాతి మొక్కలు పరిశీలించారు. దారకొండ పంచాయతీ డబ్బకోట సమీపంలో ఉన్న మారజాతి ప్లాంటేషన్‌ తనిఖీ చేశారు. దారాలమ్మ అమ్మవారి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆలయ తాత్కాలిక కమిటీ, ఆలయ పూజారితో సమావేశమే పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో డీఎఫ్‌ఓ సిహెచ్‌ సూర్యనారాయణ, సీలేరు రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ రేంజ్‌ అధికారి సింహాచలం, దారకొండ సెక్షన్‌ ఆఫీసర్‌ కే సతీష్‌, వివేకానందరావు, చిట్టిబాబు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సత్తిబాబు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.