
కోనసీమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
దేశ సంపదను కార్పొరేట్లకు దోచి
పెడుతున్నమోడీ
బిజెపికి వైసిపి, టిడిపి,జనసేన పార్టీల మద్దతు
సిగ్గుచేటు
4ప్రజారక్షణ భేరి యాత్రలో వక్తలు
ప్రజాశక్తి - అమలాపురం, రాజమహేంద్రవరం ప్రతినిధి
కోనసీమలో అపారమైన వనరులున్నా ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే దీనికి కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర మంగళవారం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా సాగింది. మండపేట కలువపువ్వు సెంటర్ వద్ద సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు కష్ణవేణి తదితరులు యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రావులపాలెం మీదుగా యాత్ర అమలాపురం చేరుకుంది. అమలాపురం నుంచి రాజోలు వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట కలువ పువ్వు సెంటర్, రావులపాలెం ఎంపిడిఒ కార్యాలయం వద్ద, అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద బహిరంగ సభలు నిర్వహించారు.
ఈ సభలకు సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంతెన సీతారాం మాట్లాడారు. కోనసీమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు.కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని తొలత ప్రతిపాదించింది సిపిఎం మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందన్నారు. ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు అవి చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కోట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేరళ ప్రభుత్వం దిక్చూచీగా ఉందన్నారు. అన్ని నిత్యావసర సరుకులను అక్కడ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందిస్తుందన్నారు. కొబ్బరి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. అనంతరం ప్రజా ప్రణాళికను ప్రజలకు పరిచయం చేశారు. ఈ ప్రణాళిక అమలుకు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల హక్కులను కాలరాసిందన్నారు. కార్పొరేషన్లకు రూపాయి కూడా కేటాయించకుండా మొండి చేయి చూపిందన్నారు. దళితులపై దాడులు చేస్తూ సామాజిక సాధికార యాత్ర చేయడం శోచనీయమని అన్నారు. జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఐక్యంగా ఉద్యమించాలన్నారు. జిల్లాలో కనీస వైద్య సౌకర్యాలు లేవన్నారు. ఏరియా ఆసుపత్రిలో వైద్యం లభించక కాకినాడ లేదా రాజమహేంద్రవరం ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఏరియా ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలన్నారు. మెడికల్ కళాశాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిత్యం గ్యాస్ పైప్ లైన్లు లీకేజీలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. చమురు సంస్థల సిఎస్‌ఆర్ నిధులను ఈ జిల్లాలోనే ఖర్చు చేయాలన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. అక్రమ ఆక్వా చెరువులకు అడ్డుకట్ట వేయాలన్నారు. తాండవపల్లిలో ఆక్వా వ్యర్థాల కారణంగా అక్కడి ప్రజలు కేన్సర్, అంధత్వం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవాలన్నారు. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. కౌలురైతులందరికీ కార్డులు ఇవ్వాలని, పంట కాలువల ఆధునికీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం, సిపిఎం రాష్ట్ర నాయకులు హరిబాబు, కొల్లాటి శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి.దుర్గాప్రసాద్, బలరాం, కృష్ణవేణి, నాగవరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇసుక ర్యాంపు కార్మికులు, కొబ్బరి ఒలుపు, దింపు కార్మికులు, యుటిఎఫ్ నాయకులు, అంగన్‌వాడీలు సమస్యలపై యాత్ర బృందానికి వినతిపత్రాలను అందించారు.