Nov 21,2023 20:58

ప్రజాశక్తి - ముదినేపల్లి
           వాతావరణ మార్పులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఎక్కడ వర్షం పడుతుందోనని వరిరైతులు వణికిపోతున్నాయి. ప్రస్తుతం మండలంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలాచోట్ల కోసిన పైరు పనలపై ఉంది. ఈ తరుణంలో మంగళవారం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులొచ్చి మండలంలో అక్కడక్కడ చిరుజల్లులు పడటంతో అన్నదాతల కంగారుపడుతున్నారు. పంటను రక్షించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. కోసిన పనలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. మండలంలో 15వేల ఎకరాల ఆయకట్టులో సార్వా వరిసాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన వరిపైరు కోతలు జరుగుతున్నాయి. సూమారు రెండు వేల ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ పంటంతా పనల మీద ఉంది. సుమారు వెయ్యి ఎకరాల్లో యంత్రాలతో కోసిన పంటకు సంబంధించి ధాన్యపు రాశులు పొలాల్లో ఉన్నాయి. ధాన్యాన్ని అమ్ముకునేందుకు అరబెట్టిన రైతులు అనేక వ్యయప్రయాసాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షం కురిస్తే వరి పనలు, ధాన్యం రాశులు తడిసి పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చిరుగుకోట, వడాలి, విశ్వనాద్రిపాలెం, పెదగొన్నూరు, కొరగుంటపాలెం, అల్లూరు, బొమ్మినంపాడు, రాజానగరం, ముదినేపల్లి తదితర గ్రామాల ఆయకట్టులో వందలాది ఎకరాల వరిపైరు పనలపై ఉంది. దీంతో రైతులు చేలల్లోని వరి పనలను, ధాన్యపు రాశులను ట్రాక్టర్లపై సురక్షిత ప్రాంతాలకు తరలించి వాటిపై పరదాలు కప్పి రక్షణ చర్యలు చేపడుతున్నారు.