ఇప్పుడంటే హైబ్రీడ్ రకాలతో ఏవేవో కొత్తమొక్కలు పుట్టుకొచ్చేశాయి. పూర్వం ఇళ్లు విశాలంగా ఉండే రోజుల్లో పెరటి మొక్కలు ఎంత బాగా విచ్చుకుని అలరించేవో! నేలనుంచి కుండీల్లోకి, అక్కడ నుంచి ప్లాస్టిక్ పిడతల్లోకి మొక్కల స్థానం మారాక మన సాంప్రదాయ పూలమొక్క జాతులు చాలా వరకూ కనుమరుగయ్యాయి. నవ్య తరానికి వన సంపద వారసత్వాన్ని చాటిచెబుదాం పదండి !
బొండు మల్లె..
బొడుపుల్లాంటి అందమైన పువ్వులు బొండు మల్లె. అమరాంతేసి కుటుంబానికి చెందినవి. గుండ్రని ఆకారంలో మెజెంటా, ఊదా, ఎరుపు, నారింజ, తెలుపు, గులాబీ రంగుల్లో పువ్వులు పూస్తాయి. ఇవి వారం రోజుల వరకూ నిగారింపుగా ఉంటాయి. దీని శాస్త్రీయనామం గోంఫ్రెనా గ్లోబోసా. ఇది చాలా వేడిని, కరువును తట్టుకుంటుంది. మొక్క 24 అంగుళాల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఈ పువ్వులను అలంకరణకు, ఔషధాల్లోనూ ఉపయోగిస్తారు.
డిసెంబరాలు..
లేత నీలిరంగు పువ్వుల మీద తెలుపు మచ్చలతో శంఖాకారంగా ఉండేవే డిసెంబరాలు. మగువలు తలలో అలంకరించుకోవడానికి, అలంకరణకు ఈ పూలను ఉపయోగిస్తారు. వీటి ఆకులు సన్నగా, చిన్నగా ఉంటాయి. పూల మధ్యలో రెండు తెల్లటి కేసరాలు పూలకు రమణీయతను అద్దుతాయి. మొక్క ఐదడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. బార్లేరియా కిష్టాటా దీని శాస్త్రీయ నామం. డిసెంబర్ నెలలో ఎక్కువగా పూస్తాయి కాబట్టి వీటిని డిసెంబరాలు అని పిలుస్తారు. ఇంటి పెరట్లో ఈ మొక్కలు అద్భుతంగా పూస్తాయి.
కనకాంబరాలు..
కాషాయరంగులో ఉండే సుతిమెత్తని సుకుమారాలు కనకాంబరాలు. ఇవి దాదాపు అడుగున్నర ఎత్తు వరకూ పెరుగుతాయి. కాండం చివర బొడుపుల్లాంటి గుత్తుల్లోంచి పువ్వులు విచ్చుకుంటాయి. కనకాంబర పూలు శ్రీలంక, దక్షిణ భారతదేశానికి చెందినవి. అకాంథేసి కుటుంబానికి చెందిన దీని శాస్త్రీయనామం క్రొస్సండ్రా ఇన్ఫండిబులి ఫార్మీస్. ఇంటి పెరట్ల్లోనూ, కుండీల్లోనూ వీటిని పెంచుకోవచ్చు. విత్తనాల ద్వారా మొక్కలు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్లోనూ నారు అందుబాటులో ఉంటుంది. ఏ రకం నేలలోనైనా ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి.
గుత్తిపువ్వులు..
కీటకాలన్నింటికీ ప్రేమ పువ్వులు గుత్తిపువ్వులు. వీటి పువ్వుల్లో మకరందం మెండుగా పొదిగి ఉంటుంది. హెక్సోనా కొక్కినియా దీని శాస్త్రీయ నామం. ఇది చిన్ని చిన్ని పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తుంది. వీటిలో ముదురు ఎరుపు, పసుపు, పింకు, తెలుపు, కాషాయం రంగుల్లో పువ్వులు పూసే మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇది నల్లరేగడి, పాటిమట్టి నేలల్లో పూలు బాగా పూస్తాయి. ఏడెనిమిది అడుగుల ఎత్తు వరకు మొక్క పెరుగుతుంది.
మందారం..
తెలుగు లోగిళ్ళలో మందారాలు మకుటాలు. ఇప్పుడు వందల రకాల్లో హైబ్రీడ్ మందారాలు వచ్చిన తరువాత మన దేశవాళీ ఎర్ర మందారాలు కనుమరుగైపోతున్నాయి. హైబికాస్ దీని శాస్త్రీయ నామం. అరుణ కాంతులు విరజిమ్మే మందారం అరవిరిసిన విరి సింగారం. మొక్క పది అడుగుల వరకూ పెరుగుతుంది. పువ్వులు అలంకరణలకూ, కేశ సౌందర్యానికి నూనెల్లో వాడతారు.
చంద్రకాంత పువ్వులు..
సంధ్య వేళ పూసే సొగసైన పువ్వులు చంద్రకాంత పువ్వులు. సాయంత్రం నాలుగు గంటలకు విరిసి, రాత్రి ఎనిమిది గంటలకల్లా వాడిపోతాయి. చంద్రుడి వికాస సమయంలో పూస్తాయి కనుక చంద్రకాంత లేదా నక్షత్ర పువ్వులని పిలుస్తారు. మిరాబిలిస్ జలపా దీని శాస్త్రీయ నామం. దీనిని 'ఫోర్ ఓ క్లాక్ ప్లాంట్' అనీ పిలుస్తారు. ఇవి పింక్, తెలుపు, ఎరుపు, పసుపు, వయిలెట్, గోధుమ రంగుల పువ్వులతో పాటు మిశ్రమ రంగుల్లోనూ పూలు పూస్తాయి. ఇది పూర్తిగా ఔట్ డోర్ మొక్క. రెండడుగుల ఎత్తు వరకూ పెరిగే ఇది పుంకాలు పుంకాలుగా పువ్వులు పూస్తుంది.
గొబ్బి పూలు..
పైసా పెట్టుబడి లేకుండా ఒకప్పుడు పల్లెల్లో ఎక్కడపడితే అక్కడ విరబూసిన అందమైన పువ్వులు గొబ్బి పూలు. వీటిని గొప్పూలు, అడవి కనకాంబరాలు, ముళ్ల కనకాంబరాలు అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయనామం బార్లేరియా ప్రియోనీటిస్. అకాంన్తాకేసియా జాతికి చెందిన ముళ్ల మొక్కిది. దీన్ని కలుపు మొక్కగా భావిస్తారు. పొదలా పెరిగి, గుత్తులుగా పువ్వులు పూస్తాయి. చూడ్డానికి అచ్చంగా కనకాంబరాలులాగా ఉంటాయి.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506