ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధం ఉండే ఉంటుంది. పరిసరాల్లో మనం నిత్యం చూసే సాధారణ మొక్కల్లో ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి. అలాంటి వాటిల్లో మనం పెరటిలో ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చు? వాటిలో ఎలాంటి పోషక, ఔషధ విలువలున్నాయి? వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు? అనేది ఈ వారం తెలుసుకుందాం !
బిళ్ళ గన్నేరు
మన గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా పెరిగే మొక్క ఇది. దీనిని ''వింకా రోజ్'' అని కూడా పిలుస్తారు. ''కాథరాంథస్ రోజస్'' దీని శాస్త్రీయనామం. రోడ్డు పక్కన, వ్యవసాయ భూములలో ఈ మొక్కలు విరివిగా కనిపిస్తాయి. బిళ్ళ గన్నేరు దీర్ఘకాలిక పొదలుగా ఉండి 30-100 సెం.మీ ఎత్తులో ఉంటాయి. వీటి పువ్వులు ఆకులలో వస్తాయి. దీని పండు 2.0-4.7 సెం.మీ పొడవులో చిన్న నల్ల విత్తనాలతో ఉంటాయి. తెల్ల, గులాబీ, వంకాయ రంగులలో రూపాయ కాసు పరిమాణంలో ఐదు రేఖలతో వీటి పువ్వులు ఉంటాయి. ఇటీవల ఇందులో మల్టీ కలర్‌లో ఉండే హైబ్రీడ్ పువ్వుల మొక్కలు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. కెన్యా, ఉగాండా, టాంజానియా దేశాల మాతృక సహజసిద్ధమైన మొక్క ఇది. దీనిని క్యాన్సర్ వైద్యంలో వాడతారు. బిళ్ళ గన్నేరు ఆకులను, పుష్పములను మధుమేహ నివారణకు, అధిక రక్తపోటును నియంత్రించి, చర్మ సంబంధిత వ్యాధుల నివారణకూ ఉపయోగిస్తారు. దీని ఆకు ఎంతో చేదుగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీని ఆకు వారానికి ఒకటి తింటే దివ్య ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు చెప్తున్నారు. వీటిని కుండీల్లోనూ, నేలమీదా పెంచుకోవచ్చు.
వాము ఆకు మొక్క
పెళుసుగా, దళసరి పత్రాలుండే మొక్క వాము ఆకుల మొక్క. మొక్క నుంచి ఆకులు తుంచితే వాము సుగంధాలను గుప్పిస్తుంది. ఇది succulent plant. అంటే ఒకసారి నీరు పోసినా అది మొక్క ఆకుల్లోని, కాండంలో దాచుకుని చాలా రోజుల వరకు బతకగలదు. కాడ తుంచి, నాటినా సులభంగా వేళ్లూనుకుని బతికేస్తుంది. దీనిని ''కర్పూర వల్లి'' అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ''ప్రెక్ట్రాంతస్ అంబ్రోనియెస్, ఇండియన్ బోరెజ్''. ఔషధ గుణాలు మెండుగా ఉండే మొక్క ఇది. అజీర్తిని తగ్గించడానికి, కడుపునొప్పిని నయం చేయటానికి వీటి ఆకుల రసాన్ని తాగుతారు. ఇంకా ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చర్మ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. తలలో చుండ్రును అదుపు చేస్తుంది. వంటకాల్లో వాము ఆకుతో బజ్జీలు, పచ్చడి, పప్పుతో కలిపి కూర చేసుకోవచ్చు. కూరల్లో స్పైసీగా ఉండటానికి వాము ఆకులు వేసుకుంటారు. దీనిని కుండీల్లోనూ, నేల మీదా పెంచుకోవచ్చు. కాస్తంత సూర్యరశ్మి తగిలే వాతావరణంలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి.
కలబంద
ఇది సక్కులెంట్ ప్లాంట్ (succulent plant). అంటే చాలాకాలం నీరు లేకపోయినా బతకగలదు. దూటలా దళసరిగా ఉండే వీటి ఆకుల్లో గుజ్జువంటి పదార్థం ఉంటుంది. ఆకుల చివర ముళ్ళు ఉంటాయి. కలబందలోనూ వందల రకాలున్నాయి. ఎక్కువ కాలం పెరిగిన మొక్క వేసవిలో సన్నని పొడవాటి ఊచలా ట్రిగ్ వచ్చి, పువ్వులు పూస్తుంది. ఇందులో ఉండే జెల్‌లాంటి పదార్థం చాలా రోగాలకు దివ్య ఔషధం. ముఖ్యంగా కీళ్ళల్లో జిగురును వృద్ధి చేస్తుంది. ఇటీవల సబ్బులు, నూనెలు, టూత్ పేస్టులు, ఫేస్ వాష్‌లలోనూ దీనిని విరివిగా వాడుతున్నారు. దీనిని ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు.
ఇన్సులిన్ ప్లాంట్
పొడవాటి ఆకులతో రెండడుగులు ఎత్తు వరకూ ఈ మొక్క పెరుగుతుంది. ఇది పసుపు రంగు పువ్వులు పూస్తుంది. దీని కాండాన్ని తుంచి, నాటినా మొక్క బతుకుతుంది. ఎండ పడే ప్రాంతాలలో ఇది పెరుగుతుంది. దీని శాస్త్రీయనామం ''కాస్టస్ ఇగెయస్''. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో ఈ ఔషధ గుణాలున్న మొక్క సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టే దీన్ని ''ఇన్సులిన్ ప్లాంట్'' అని అంటారు. సాధారణంగా 'స్పైరల్ ఫ్లాగ్' అని పిలుస్తారు. ఈ మొక్కలో ఉన్న ''కోరోసాలిక్ ఆమ్లము'' శరీరంలోని ఇన్సులిన్‌ను అదుపులో ఉంచుతుంది. వీటి ఆకుల్లో ప్రోటీన్, ఐరన్, ఆకార్బిక్ యాసిడ్, ఎ-టోకోఫెరాల్ల్, కెరోటిన్, టెర్పెనాయిడ్స్, స్టెరాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్, కాంపోనెంట్లు అధికంగా ఉంటాయి. డయాబెటిస్‌ను నియంత్రించడానికి మనదేశంలో వీటిని ఉపయోగిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అతి తక్కువ సమయంలో తగ్గించగలదు. అలాగే ఇన్సులిన్ పెరిగేలా చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉండటానికి రోజూ ఒక ఆకు తింటే మంచిది. ఈ ఆకును అల్లం, కొత్తిమీరా, గోంగూర, కరివేపాకులాంటి పచ్చళ్ళలో ఉపయోగిస్తుంటారు. కాస్టస్‌లో చాలా రకాలున్నాయి. కేవలం పసుపు రంగు పువ్వులు పూసే ఇగస్ మాత్రమే మధుమేహానికి పనికి వస్తుంది.
వాక్కాయ
శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధంగా ఉపయోగపడేది వాక్కాయ. ఇవి ఈత కాయలు పరిమాణంలో ఉండి, పుల్లపుల్లగా.. కాస్తంత వగరుగా ఉంటాయి. లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను, పక్వానికి వచ్చిన తర్వాత తెలుపు, పింకు, ఎరుపు రంగుల కలబోతతోనూ కాయలు ఉంటాయి. అన్ని రకాల నేలల్లోనూ ఈ మొక్కలు పెరుగుతాయి. బంజరు భూముల్లో, రాతి నేలల్లోనూ పెరుగుతాయి. ఇవి వర్షాకాలంలో కాయలు కాస్తాయి. మొక్క పొదలా నాలుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరిగి, నిండుగా కాయలు కాస్తుంది. ఇందులో విటమిన్- ఎ, సి పుష్కలంగా ఉంటాయి. జుట్టు సమస్యలకు, చర్మ వ్యాధులకు, హృద్రోగాలకు, కొలెస్ట్రాల్ నివారణకు, రక్తాన్ని శుద్ధి చేయడానికి వాక్కాయను ఉపయోగిస్తారు. దీనిని వంటల్లోనూ వాడతారు. ఇది కుండీల్లోనూ, నేలమీదా పెరుగుతుంది.
తిప్పతీగ
పొలాల్లో, చేలగట్ల మీద, పుంతల్లో, రోడ్ల పక్కన, పల్లెల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగే పాదు మొక్క తిప్పతీగ. దీన్ని ''పిచ్చిపాదు'' అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ''టినోస్పోరా కార్డిఫోలియా''. అన్ని కాలాల్లోనూ ఈ తీగ చక్కగా ఎగబాకి, గుండ్రని ఆకులతో వికసిస్తుంది. చిన్నచిన్న కాయలు గుత్తులుగా కాస్తుంది. వీటి కాయలు పండితే ముదురు ఎరుపు రంగులోకి వస్తాయి. వీటి ఆకులు విపరీతమైన చేదు. చాలా రోగాలు నయం చేయడానికి ఇది మంచి ఔషధం. ముఖ్యంగా మధుమేహన్ని అదుపులో ఉంచడానికి తిప్పతీగను ఉపయోగిస్తారు. వీటి ఆకుల కషాయం పరగడుపున తీసుకుంటే మంచిది. వందల రకాల ఆయుర్వేద మందుల్లో తిప్పతీగ భాగాలు ఉపయోగిస్తున్నారు. ఆర్థ్రటైటిస్, కీళ్ళజబ్బులు, బాలింతలు, గర్భవతుల ఉపశమనానికి వాడే మందుల్లో తిప్పతీగను ఉపయోగిస్తారు. దీనిని ఇంటి పెరటిలో, కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
- చిలుకూరి శ్రీనివాసరావు
8985945506