Jan 22,2023 21:12

రబీ నాట్లు దాదాపు పూర్తి
1 నుంచి వంతులవారీ విధానానికి సన్నాహాలు
నీటిఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు
ఉమ్మడి జిల్లాకు 4,600 క్యూసెక్కుల నీరు విడుదల
సీలేరు జలాలే ఆధారంగా ముందుకు
జీతాలు అందక లస్కర్లలో తీవ్ర అసంతృప్తి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

రబీ సాగుకు సంబంధించి వంతులవారీ విధానంలో సాగునీటి సరఫరాకు అధికారులు సమాయత్తమవుతున్నారు. రబీనాట్లు దాదాపు పూర్తవడంతో ఇక నుంచి వంతులుగా సాగునీరు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వంతుల విధానం అమలు చేయనున్నట్లు సమాచారం. వంతులవారీ విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే చర్యలకు సంబంధించి ఇరిగేషన్‌ అధికారులు ఇప్పటి నుంచే తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రబీలో 4.60 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. 11 ప్రధాన కాలువలు, 400కుపైగా పిల్ల కాలువల ద్వారా డెల్టాలో సాగునీటి సరఫరా జరుగుతోంది. గోదావరిలో నీటి ప్రవాహాం తగ్గుముఖం పట్టింది. సీలేరులో జలవిద్యుత్‌ ఉత్పత్తి ద్వారా వచ్చే నీటిని సైతం ఇప్పటికే వినియోగిస్తున్నారు. ముందుముందు నీటి ఎద్దడి సమస్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో సాగునీటి పంపిణీలో పలు చర్యలకు ఇరిగేషన్‌ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. సాగునీటి సమస్య రాకుండా ఉండాలంటే ఉమ్మడి జిల్లాకు రోజుకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. నాట్లు సమయంలో సాగునీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. దమ్ము చేసే సమయంలో పొలాల్లో నీరు ఎక్కువగా ఉండాలి. దీంతో రబీనాట్లును దృష్టిలో పెట్టుకుని మొన్నటి వరకూ రోజుకు ఆరు వేలు, 5,500 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశారు. నీటి ప్రవాహాలు తగ్గడంతో ప్రస్తుతం 4,600 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతోంది. దాదాపు రబీ నాట్లు పూర్తవ్వడంతో రైతులు మొదటి, రెండో విడత ఎరువులు చల్లడం వంటి నేపథ్యంలో సాగునీటి వాడకం తగ్గింది. దీంతో ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు సరిపోతుంది. ఎరువుల చల్లిక పూర్తయ్యి వరి పైరు దుబ్బు చేసే సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో వంతులవారీ విధానం అమలు చేస్తే తప్ప ప్రస్తుతం సరఫరా చేస్తున్న సాగునీటితో ముంందుకు సాగడం కష్టం. ఎండలు తీవ్రమయ్యే కొద్ది సాగునీటి సమస్య తీవ్రతరమయ్యే పరిస్థితి రానుంది. రానున్న సాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జిల్లా ఇరిగేషన్‌ అధికారులు వంతులవారీ విధానానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతియేటా జనవరి 20వ తేదీ తర్వాత వంతుల విధానం అమలవుతోంది. అయినప్పటికీ రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. సాగునీటి కోసం రాత్రీ పగలు పడిగాపులు పడాల్సిన దుస్థితి వచ్చేది. ఈ ఏడాదైనా సాగునీటి సరఫరాలో తగు జాగ్రత్తలు తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అంతా కోరుతున్నారు. ఇరిగేషన్‌ అధికారులు ఏవిధంగా ముందుకు సాగుతారో వేచిచూడాలి.
తీవ్ర అసంతృప్తిలో లస్కర్లు
రబీలో సాగునీటి పంపిణీలో కాలువలపై పని చేసే లస్కర్లదే కీలక పాత్ర. వంతులవారీ విధానం అమలైతే లస్కర్లు రాత్రీ పగలు పని చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 197 మంది లస్కర్లు కాలువలపై పని చేస్తున్నారు. వీరికి ఏడాదికి పది నెలల జీతం మాత్రమే ఇస్తారు. ఏప్రిల్‌, మే నెల జీతాలు ఇవ్వరు. అయితే పని మాత్రం చేయించుకుంటున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఏప్రిల్‌ 25వ తేదీ తర్వాతే కాలువల మూసివేత జరుగుతోంది. అప్పటి వరకూ లస్కర్లు పని చేయాలి. అంతేకాకుండా మే నెలలో క్లోజర్‌ పనులంటూ లస్కర్లను ఉపయోగించుకున్నా జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. ఇచ్చే పది నెలల జీతాలైనా సక్రమంగా ఇస్తున్నారా అంటే అదీ లేదు. తొమ్మిది నెలలుగా లస్కర్లకు జీతాలు అందలేదు. ప్రతినెలా ఇచ్చే రూ.10,500 కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో లస్కర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాలు ఇవ్వాలంటూ ఇటీవల నరసాపురం పర్యటనలో సిఎం జగన్‌ను కలిసినా ప్రయోజనం లేకుండాపోయింది. తమకు జీతాలు ఇప్పించాలని ఉమ్మడి జిల్లా ఉద్యోగ సంఘాల జెఎసి ఛైర్మన్‌, ఇరిగేషన్‌ ఉద్యోగ సంఘం నాయకుడు చోడగిరి శ్రీనివాస్‌ను లస్కర్లు ఆదివారం కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి జీతాలు ఇప్పించాలని కోరారు. వంతుల వారీ విధానం అమలులో కీలక పాత్ర పోషించే లస్కర్లకు పెండింగ్‌ జీతాలు వెంటనే చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం, అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.