ప్రజాశక్తి-వడ్డాది
వడ్డాది వంతెనపై ఎట్టకేలకే రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆదివారం జెండా ఊపి వంతెనపై రాక పోకలను పున:ప్రారంభించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరకు రవాణాకు ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ఫ్యాక్టరీ నిధులు రూ.6 లక్షలు వెచ్చి వడ్డాది వంతెనకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలుపుదల చేసి రాత్రి పగలు జెసిపితో బండరాళ్లు పేర్చారు. గతంలో పేర్చిన బండరాలను తొలగించి కొత్తగా పెద్దరాళ్లను తీసుకొచ్చి వెడల్పు చేసి వంతెన నాలుగు ఖానాల మధ్య రాళ్లను పేర్చారు. దీంతో ఆదివారం నుండి పూర్తిస్థాయిలో రాకపోకలు సాగుతున్నాయి. ఏడు నెలల క్రితం భారీ వర్షాలు కారణంగా వరద ప్రవాహానికి వంతెన నాలుగు ఖానాలు కుంగిపోవడంతో నాడు పూర్తిగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నాడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చిన్న వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అయితే రెండు నెలల క్రితం వర్షాలకు ఆ ఖానాలకు పేర్చిన రాళ్లు జారి పోవడంతో వాహనాల రాకపోకలు మళ్లీ నిలిచిపోయాయి. దీంతో చెరకు కాటాల నుంచి ఫ్యాక్టరీ చెరకు రవాణాకు ఆటంకం ఏర్పడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం ఎమ్మెల్యే ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, ఫ్యాక్టరీ నిధులతో వంతెన మరమ్మతులు పూర్తి చేశారు. దీనితో రైతులు, వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఎమ్‌డి వి.సన్యాసినాయుడు, సిడిఓ రామం, జెడ్పిటిసి దొండా రాంబాబు, వైస్ ఎంపిపి దొండా లలితా నారాయణ మూర్తి, కొల్లిమల్ల అచ్చంనాయుడు పాల్గొన్నారు.










