Apr 14,2023 00:05

గొట్టెలపాడు గెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో తాడు సహాయంతో అవతలి ఒడ్డుకు వెళ్తున్న గిరిజనులు (ఫైల్‌ఫొటో)

ప్రజాశక్తి-కొయ్యూరు
వైసిపి ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనా పనులు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఉల్లిగుంట చీడిపాలెం, మఠంభీమవరం, పలకజీడి పంచాయతీల పరిధిలో గెడ్డలు, కాలువపై బ్రిడ్జిలు నిర్మాణానికి కోట్ల రూపాయలు నిధులు రెండేళ్ల క్రితం మంజూరైనా నేటికీ నిర్మాణ పనులు ప్రారంభించలేదు.
కొయ్యూరు- వై.రామవరం వెళ్లే ప్రధాన రహదారి నుండి లోపలకి ఉల్లిగుంట చీడిపాలెం వెళ్లే మార్గంలో గొట్టెలపాడు వద్ద ఉన్న గెడ్డ వర్షా కాలంలో పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వర్షా కాలం నాలుగు నెలలు సుమారు 15కు పైగా గ్రామాల ప్రజలకు మిగిలిన ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోతున్నాయి. అత్యవసర పరిస్థితులలో రోగులను ఆసుపత్రులకు తరలించలేకపోతున్నామని, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి కాలువ దాటి వెళ్లలేక పోతున్నారని, గొట్టెలపాడు వద్ద గెడ్డపై బ్రిడ్జి నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు అనేకసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. చివరికి రెండేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. ఏడాది క్రితం పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి శంకుస్థాపన కూడా చేశారు. కాని ఇప్పటికీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇదే కాకుండా మఠంభీమవరం పంచాయతీ, వేమనపాలెం నుండి జంగాలతోట మధ్యలో గెడ్డపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50 కోట్లు, పలకజీడి పంచాయతీ పరిధి ఈదులుబంధ, గొంది కోట మధ్యలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.30 కోట్లు రెండేళ్ల క్రితం మంజూరయ్యాయి. ఈ బ్రిడ్జిల నిర్మాణానికి నేటికీ శంకుస్థాపనే జరగలేదు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన సందర్భాల్లో నిధులు మంజూరయ్యాయని, వంతెనల నిర్మాణం వెంటనే చేస్తామని చెబుతున్నారు తప్ప ఆచరణలో ఒక్క బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టడం లేదు. ఎమ్మెల్యేతో పాటు ఆమె వెంట వచ్చిన వైసిపి మండల నాయకులు కూడా ఈ బ్రిడ్జిల విషయం మరిచిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం మంజూరైన నిధులకు సంబంధించి పనులు చేపట్టకపోవడంతో ఆ నిధులు ఏమయ్యాయని, వెనక్కి వెళ్లిపోయాయా? లేదంటే దారి మళ్లించారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యను అర్థం చేసుకొని నిధులు మంజూరైన మూడు బ్రిడ్జిలను వెంటనే నిర్మాణం చేపట్టాలని ఆయా పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.