Aug 27,2023 21:53

శిరోమండనం చేసుకొని నిరసన తెలుపుతున్న గిరిజనులు, సంఘీభావం తెలిపిన టిడిపి, జనసేననాయకులు

ప్రజాశక్తి- కొమరాడ : మండలంలో దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు-లాబేసు వంతెనను పూర్తి చేసి గిరిజను ప్రాణాలు కాపాడాలని వంతెన సాధన కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. వంతెన పనులు ప్రారంభించారని కోరుతూ వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహారదీక్ష 11వ రోజు ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా వంతెన పూర్తి కోసం టిడిపి, జనసేన నాయకులు రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం రిలే దీక్ష ప్రాంగణం వద్ద బాధిత గ్రామాల గిరిజనులు వంతెన పనులు ప్రారంభించి పూర్తి చేయలేని కోరుతూ సగం గుండు గీసుకొని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోమవారం జరగనున్న ర్యాలీ, మహా ధర్నా కార్యక్రమంలో మండల ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కోవట్ల పేట నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం కార్యాలయం బయట ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, పాలకులు వంతెన నిర్మాణంపై కనీస శ్రద్ధ చేపకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో శంకుస్థాపన చేసినా నేటికీ వంతెన పూర్తి కాకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అతి పెద్ద వంతెనను మూడేళ్లలో నిర్మించినా మన ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి వంతెన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసే గిరిజనుల కష్టాలు తీర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన నాయకులు వంగల దాలినాయుడు, టిడిపి నాయకులు బత్తిలి శ్రీనివాసరావు, బురిడి వేణుగోపాలనాయుడు, ఎం.కృష్ణమూర్తి నాయుడు, సాధన కమిటీ సభ్యులు నూకరాజు తదితరులు ఉన్నారు.