ప్రజాశక్తి-బొబ్బిలి : అవినీతి, అక్రమాలు ఎన్నో రోజులు దాగిపోవని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన అన్నారు. గురువారం శిథిలావస్థకు చేరిన పారాది వంతెనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.30లక్షలు మంజూరు చేస్తే నాసిరకంగా మరమ్మతు పనులు చేశారన్నారు. వంతెనకు మెరుగులు దిద్దడం వలనే నేడు కుంగిపోయే స్థితికి చేరిందన్నారు. వంతెన పరిస్థితి బాగోలేకపోవడం వలనే టిడిపి హయాంలో నిధులు కేటాయించి తన సోదరుడు సుజయకృష్ణ రంగారావు అప్పటి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో కలిసి శంకుస్థాపన చేస్తే వైసిపి ప్రభుత్వం టెండర్ రద్దు చేసిందన్నారు. బిల్లులు చెల్లింపుపై ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని విమర్శించారు. పోలీసులు సకాలంలో వంతెన కుంగిపోవడాన్ని గమనించడం వల్లే ప్రమాదం తప్పిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టిన తర్వాత వాహనాలు రాకపోకలకు అనుమతి ఇవ్వాలని, నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రౌతు రామమూర్తి, ఆర్.శరత్, వెంకటేష్, వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు.










