- గొట్టాబ్యారేజీ వద్ద 42 వేల క్యూసెక్కుల నీరు
- మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, ఉపసంహరణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: వంశధార పరవళ్లు తొక్కుతోంది. ఒడిశాలో కురిసిన వర్షాలకు నదిలోకి భారీగా వరదనీరు చేరింది. హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద ఉదయం ఏడు గంటలకు గరిష్టంగా 42,300 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి 43,456 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. వంశధార వరద ప్రవాహం 40 వేల క్యూసెక్కులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం పది గంటల తర్వాత క్రమేణా వరదనీరు తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నీటి ప్రవాహం 37వేల క్యూసెక్కులకు తగ్గడంతో, మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. సాయంత్రానికి 29,961 క్యూసెక్కులకు తగ్గింది. వంశధార ప్రాజెక్టు ఇఇ డిఎస్ ప్రదీప్, డిఇ వై అనీల్ కుమార్, ఎఇఇలు కె.ధనుంజయరావు, జి.పరిశుద్ధబాబు, పి.శ్రీవాణి గొట్టాబ్యారేజీ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. జిల్లాకు వరద ముప్పు ఏమీ లేదని, రేపు ఉదయానికి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఇఇ డి.ఎస్ ప్రదీప్ తెలిపారు.










