
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: వంశధార భూసేకరణ యూనిట్-4ను కొనసాగించాలని రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా అధ్యక్షులు కె.శ్రీరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వేణుగోపాల్ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును కోరారు. పెద్దపాడులోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. వంశధార ప్రాజెక్టు కోసం 2005లో నాలుగు భూసేకరణ యూనిట్లను ప్రభుత్వం నెలకొల్పిందని తెలిపారు. వీటిలో రెవెన్యూ, ల్యాండ్ సర్వే విభాగం ఉద్యోగులను నియమించి భూసేకరణ చేపట్టిందని గుర్తుచేశారు. ఒక్కో యూనిట్‌లో 35 మంది పలు కేడర్లలో విధులు నిర్వహించేవారని వివరించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఇతర ఉద్యోగులు నిరంతరాయంగా పనిచేయడం వల్ల ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ దాదాపుగా పూర్తి చేయడమైందని తెలిపారు. గతేడాది మేలో మూడు యూనిట్లను ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ ఏడాది డిసెంబరు 31తో యూనిట్- 4 గడువు కూడా ముగుస్తుందని వివరించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, కోర్టు వివాదాలు, చెల్లింపులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు యూనిట్-4ను మరికొంతకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని వివరించారు. మంత్రిని కలిసిన వారిలో సంఘ కార్యదర్శి బి.వి.ఎన్.ఎన్ రాజు, జి.శ్రీనివాసరావు తదితరులున్నారు.