
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్) ఎముకలు, కీళ్ళ విభాగం మూడో యూనిట్ వైద్యులు ఆపరేషన్ అవసరం లేకుండానే వంకర కాళ్లను సరిచేశారు. కాళ్లు మెలితిరిగి పోయి ఇబ్బందులు పడుతున్న పలువురు చిన్నారులకు విజయవంతంగా చికిత్స చేశారు. దీనిపై ఆ విభాగాధిపతి డాక్టర్ ఎ.శ్రీనివాస్, వైద్య బృందాన్ని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ అభినందించారు. ఈ మేరకు వివరాలను బుధవారం వెల్లడించారు. పుట్టగానే కాలు వంకరతో వచ్చిన చిన్నారులకు ఆపరేషన్ లేకుండా వైద్యం చేసి కాళ్ళను సరి చేస్తారని చెప్పారు. ప్రతి బుధవారం ఓపీకి వచ్చిన వారికి కోత, కుట్లు లేకుండా కాళ్లను సరి చేస్తారన్నారు. ముందుగా క్యూర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ గ్రామాల్లో కాళ్లు వంకరగా ఉన్న పిల్లలను గమనించి వారిని ప్రభుత్వ ఆసుపత్రి ఎముకలు-కీళ్ల విభాగం మూడో యూనిట్ తీసుకుని వస్తారని, ఆ చిన్నారులకు ఆపరేషన్ లేకుండా నాలుగేళ్ల పాటు వైద్య సేవలు అందిస్తారని వివరించారు. వారికి అవసరమైన బూట్లను కూడా అందిస్తారని, వాటి ఖరీదు దాదాపు నాలుగేళ్లలో రూ.లక్ష వరకూ అవుతుందని చెప్పారు. డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపరేషన్ లేకుండా చేసే చికిత్సను పోన్‌సెట్టా టెక్నిక్ ద్వారా చేస్తామని తెలిపారు. పుట్టగానే చిన్నారులకు కాళ్లు వంకరగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకుని రావాలన్నారు.