అద్భుత జ్ఞాపపశక్తితో అబ్బురపరుస్తున్న చిన్నారి
పలు అవార్డులు, రివార్డులతో విశాఖ కీర్తి విశ్వవ్యాప్తం
ప్రజాశక్తి-సీతమ్మధార : నగరంలోని మురళీనగర్ ప్రాంతానికి చెందిన రెండేళ్లయినా నిండని చిన్నారి సిరికి విద్యాధరి తన అద్భుత మేధాశక్తితో ఔరా అనిపించే రీతిలో పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుంది. సిరికి నూకనాయుడు, శాంతి దంపతుల ద్వితీయ సంతానం విద్యాధరి. బుడిబుడి అడుగులు వేస్తూ, చిలిపి చేష్టలతో ముద్దులొలికించే మాటలతో బుజ్జిగా కనిపించే చిన్నారి విద్యాధరి, తన అద్భుత జ్ఞాపకశక్తితో అత్యంత ప్రతిష్టాత్మకమైన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ నుండి 'వండర్ కిడ్' అవార్డును చేజిక్కించుకుంది. ప్రపంచంలోనే రెండేళ్లలోపు చిన్నారుల్లో అరుదైన రికార్డు సృష్టించడం ద్వారా చిన్నారి విద్యాధరి వండర్ కిడ్ గా అవతారమెత్తింది. కేవలం 46 సెకండ్ల వ్యవధిలో దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులను టకటక చెప్పడంలో దిట్ట. తడుముకోకుండా రాజధానుల పేర్లు, శరీర భాగాల పేర్లు, పండ్లు, కాయగూరలు, పుష్పాలు, వాహనాలు, పక్షులు, జంతువుల పేర్లను ఆంగ్లంలో చకాచకా చెపుతూ తన సత్తా ఏంటో చూపిస్తోంది. బాల మేధావి విద్యాధరి ఆంగ్లంలో వారాల పేర్లు కుటుంబ సభ్యుల వివరాలు నెంబర్లు చెప్పడంతో పాటు మన జాతీయ చిహ్నాలు, జంతువులు, నదులు గురించి టకటక చెప్పేస్తూ అబ్బురపరుస్తోంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా యోగాసనాలు వేస్తూ అందరినీ ఆశ్చర్య చికితులను చేస్తూ వండర్ కిడ్‌గా రికార్డును విద్యాధరి తన పేరిట లిఖించుకుంది.
రెండేళ్లప్రాయం నిండకుండానే ఇలా ఎన్నో అద్భుతాలతో ప్రపంచంలోనే వండర్ కిడ్‌గా రికార్డ్ సష్టించి విశాఖ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన చిన్నారి విద్యాధరి ప్రతిభాపాటవాలను గుర్తించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ విద్యాధరికి 'మల్టిపుల్ మెమరీ యాక్టివిటీస్ బై ద యంగెస్ట్ ఏజ్' అవార్డును ప్రదానం చేసింది. చిన్నారి విద్యాధరి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకునేలా తర్ఫీదునివ్వడంలో ఆమె తల్లి శాంతి కృషి ఎంతో ప్రశంసనీయం.అందరు తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపక మేధాశక్తిని గుర్తించి, వారిలో దాగి ఉన్న సజనాత్మక శక్తిని వెలికి తీస్తే తన కుమార్తె వలె ఎన్నో రికార్డులు సృష్టించే అవకాశం ఉందని శాంతి అంటోంది. తన భర్త నాయుడు అందించిన సహకారంతోనే తన బిడ్డను వండర్ కిడ్‌గా తీర్చిదిద్దగలిగానని శాంతి చెబుతోంది.
విద్యాధరికి రంగాసాయి అభినందన
వండర్‌కిడ్‌గా ప్రశంసలు అందుకుంటున్న విద్యాధరిని శనివారం విశాఖ పౌర గ్రంధాలయంలో రంగసాయి నాటక సంఘం ఆధ్వర్యంలో ఆశీర్వచన అభినందన నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు పిఎఆర్ పాత్రుడు, నాగనబోయిన నాగేశ్వరరావు, జోగారావు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు వీరుమామ, కోరుకొండ రంగారావు, ప్రముఖ బిల్డర్ ఆర్‌వివి. సత్యనారాయణ, పార్వతీదేవి దంపతులు, జమ్మా చినబాబు, తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. చిన్నారి విద్యాధరిపై రత్నా సింగ్ కవిత చదివి వినిపించారు. రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాదంగీర్ సాయి వందన సమర్పణ చేసారు.










