నాలుగు పదులు దాటితే చాలు వృద్ధాప్యంలోకి అడుగెట్టినట్టు కొందరు భావిస్తుంటారు. తాము అశక్తులమని పెద్దగా పనిచేయలేమని అనుకుంటారు. కానీ ఒడిశాకు చెందిన 102 ఏళ్ల వృద్ధుడు ఇంకా ఎందరో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. వయస్సును బట్టి తాను కూల్‌మాస్టర్ అనుకుంటే తప్పని.. క్రమశిక్షణ లేని పిల్లల్ని ఎలా శిక్షించాలో తనకు బాగా తెలుసని చెబుతున్నారు. ప్రతి కుటుంబంలో నాలుగు తరాలకు పాఠాలు చెప్పిన ఘనత ఆయనది. స్వాతంత్య్రం రాకమునుపు నుంచే ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న ఒడిశాకు చెందిన 'నందాప్రస్టీ' ఎందరికో ఆదర్శం.
ఒడిశా జజ్పూర్ జిల్లాలోని కాంతిరా గ్రామానికి చెందిన 102 ఏళ్ల నందాప్రస్టీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ వయస్సు వ్యక్తులెవరైనా మునిమనవళ్లతో ఆడుతూ పాడుతూ రోజును గడిపేస్తారు. కానీ నందాప్రస్టీ మాత్రం పిల్లలకు పాఠాలు చెప్పకపోతే తనకు రోజు గడవదని అంటున్నారు. ఉపాధ్యాయులు ఎవరైనా మహా అంటే రెండు తరాలను చూసి ఉంటారు. కానీ నందా సార్ మాత్రం ప్రతి కుటుంబంలో నాలుగు తరాలను చూసిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.
'నేను బోధించడం ప్రారంభించిన సంవత్సరం కచ్చితంగా గుర్తులేదు. కానీ భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే పాఠాలు చెబుతున్నా. అప్పట్లో నా గ్రామంలో అందరూ నిరక్షరాస్యులే. చదువు నేర్చుకోవడానికి మా మామయ్య వారి ఊరికెళ్లాను. అక్కడ చదువు ముగించుకుని వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం పేరుతో నేను ఎక్కడో ఉండటం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కాబట్టి ఉద్యోగం మానేసి ఊరికి వచ్చేశాను. అప్పట్లో చేయడానికి పనిలేక ఇంట్లో ఖాళీగా ఉండేవాడ్ని. మా ఊర్లో చిన్న పిల్లలు వారికంటూ ఎలాంటి లక్ష్యం లేకుండా సమయాన్ని వృథా చేసుకోవడం చూసి బాధేసింది. ఎలాగైనా వారికి చదువు నేర్పాలి అనుకున్నా. అలా వారికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టా. అందుకుగాను ఒక్కపైసా వసూలు చేసేవాడిని కాదు' అంటున్నాడు నందాప్రస్టీ.
అతి తక్కువ కాలంలోనే నందాప్రస్టీ పేరు 'నందాసార్' గా ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. రోజుకు రెండు షిప్టులుగా పాఠాలు చెబుతారాయన. ఉదయం పూట పిల్లలకు ఒడియా వర్ణమాల, కొంచెం గణితం, సాయంత్రం వృద్ధులకు సంతకం ఎలా చేయాలో నేర్పుతారు. స్వాతంత్య్రం రాకమునుపు నుంచి ఇప్పటికీ పాఠాలు చెబుతూనే ఉన్నారు.
ప్రస్తుతం ఆయన దగ్గర 40 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా.. నందా సార్ దగ్గరకు రావడం మాత్రం మానలేదు. ఇప్పటికీ ప్రతిరోజూ ఉదయాన్నే ఆరు గంటలకు నిద్రలేస్తారాయన. ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకూ క్లాసులు తీసుకుంటారు. సాయంతం 4.30 నుంచి మరలా కొంత సమయం క్లాసులు తీసుకుంటారు. వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగినా నందాసార్ క్లాసులకు ఎలాంటి ఆటంకాలూ ఉండవు. మొదట్లో ఒక చెట్టు కింద పాఠాలు బోధించేవారు. ఏడు సంవత్సరాల క్రితం అదే స్థలంలో ఆయన ఆలయం కట్టించారు. ఏదైనా ఇబ్బంది కలిగిన రోజు ఆలయంలోనే బోధన సాగిస్తారు.
ఇప్పటివరకూ నందా సార్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం తీసుకోలేదు. 'నేను ఎందుకు సహాయం తీసుకోవాలి? ఇన్ని సంవత్సరాలు ఉచితంగానే చదువు నేర్పాను. నా ఉద్దేశ్యం ఇతరులకు అవగాహన కల్పించడమే. నాకు కావలసింది అంతే. నా ఆరోగ్యం అనుమతించినంత కాలం పిల్లలకు చదువు నేర్పుతూనే ఉంటాను' అంటున్నారు నందాప్రస్టీ.