Mar 06,2021 07:10

చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం 'ఛలో ఢిల్లీ'తో ఆరంభమై నేటికి వంద రోజులు పూర్తవుతుంది. శాంతియుతంగా, విశాల ఐక్యతతో క్రమశిక్షణతో సాగుతున్న అపూర్వ పోరాటమిది. ఢిల్లీ చుట్టూ పోరాట గ్రామాలు వెలిశాయి. దీర్ఘకాల పోరాటానికి అనుగుణంగా ఆవాసాలేర్పడ్డాయి. నవంబరు 26 నుండి లక్షలాది మంది రైతాంగం ఢిల్లీ సరిహద్దు లోని అన్ని ప్రధాన రహదారుల్లో బైఠాయించారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, విద్యుత్‌ చట్ట సవరణను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళన కొనసాగుతోంది. దీర్ఘకాలంగా రైతులు, రైతు సంఘాలు కోరుకున్నట్లుగా స్వామినాథన్‌ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం చేయాలని కోరుతున్నారు. న్యాయమైన ఈ కోర్కెలను మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చట్టాల నుండి వెనక్కు తగ్గేది లేదని మొండికేసి కూర్చున్నది. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రారంభం నుండే రకరకాల ఎత్తులు, జిత్తులు వేస్తున్నది. ముందు నిర్బంధంతో అణచాలనుకున్నది. రైతులు లాఠీదెబ్బలను ఎదుర్కొని ముందుకు కదలడంతో అసత్య ప్రచారాలకు పూనుకున్నది. అదీ పనిచేయకపోవడంతో చర్చల ప్రహసనానికి తెరలేపింది. చర్చల్లో దాగుడుమూతలాడుతూ రైతులపై నెపం పెట్టాలని చూసి తానే బోనులో నిలబడ్డది. జనవరి 26వ తేది ట్రాక్టర్ల ప్రదర్శనను ఒక పథకం ప్రకారం కుట్ర పూరితంగా దారి తప్పించి జాతీయ పతాకానికి అవమానం జరిగిందంటూ గోల చేసింది. ఆఖరికి ఆ పని చేసిన ఘనులు బిజెపి వారేనని తేలడంతో వారి నోటికి తాళం పడింది.
సంఘీభావంపై అనాగరిక దాడి
రోజులు గడిచేకొద్దీ ఉద్యమానికి మద్దతు పెరగడం ఆరంభమైంది. దేశ విదేశాల నుండి సంఘీభావం వ్యక్తమవుతున్నది. అనేక మంది మేధావులు, ప్రముఖులు రైతులకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఉద్యమానికి రక్షణ వలయంగా ఏర్పడిన సంఘీభావ శక్తిపై దెబ్బకొట్టడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నింది. గడ్డకట్టే చలిలో రోడ్డుపై రోజుల తరబడి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను చూసి స్పందించిన ప్రముఖ పర్యావరణవేత్త, ముక్కుపచ్చలారని బాలిక గ్రెటా థన్‌బెర్గ్‌, ప్రముఖ పాప్‌ గాయని రిహాన్నా లాంటి వారు ''ఢిల్లీ రైతు ఉద్యమం గురించి మనం ఎందుకు చర్చించుకోవడం లేదు?'' అంటూ వేసిన ప్రశ్నకు ట్విట్టర్‌లో కోట్ల మంది స్పందించడంతో మోడీ సర్కారుకు వణుకు పుట్టింది. ఆగమేఘాల మీద తన పెయిడ్‌ సోషల్‌మీడియా సోల్జర్లతో ఎదురుదాడి ప్రారంభించింది. సచిన్‌ టెండూల్కర్‌, కంగనా రనౌత్‌ లాంటి సెలబ్రిటీలను రంగంలోకి దించి ఎదురు దాడికి అస్త్రాలుగా వాడుకుంది. ఉద్యమానికి మద్దతు పలికిన తాప్సీ, అనురాగ్‌ కాశ్యప్‌ వంటి బాలీవుడ్‌ నటులు, దర్శకులపై ఐ.టి దాడులు చేస్తున్నది. గ్రెటా థన్‌బెర్గ్‌ పైనా కేసు నమోదు చేసింది. నలుగురూ నవ్విపోతారన్న సిగ్గు కూడా లేకుండా అంతర్జాతీయ సమాజంలో భారతదేశానికి తలవంపులు తెచ్చేలా చేసింది. గ్రెటా థన్‌బెర్గ్‌ ట్విట్టర్‌లో తన వ్యాఖ్యానంతోపాటు వ్యవసాయ చట్టాల పూర్వాపరాలను తెలియజేసే ''టూల్‌ కిట్‌'' (నోట్స్‌)ను జతపర్చింది. ఇలాంటి నోట్సులనే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు తరచుగా టూల్‌కిట్‌లని పిలుస్తుంటారు. టూల్‌కిట్‌ ఒక ఆయుధం కాదు, సాధనం. అదేదో బాంబు పెట్టడానికి ప్లాన్‌ చేసిన ఉగ్రవాదిలాగా దిశా రవి అనే 22 సంవత్సరాల అమ్మాయిపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. కోర్టు సైతం ఛీ కొట్టడంతో ఆ అమ్మాయికి బెయిలు లభించింది. ''రైతాంగ ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టడమే నేరమైతే...అందుకు నేను జైల్లో ఉండటానికి కూడా సిద్ధం'' అంటూ కోర్టులో దిశా రవి చేసిన ప్రకటన ఈ తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈమె చేసిన నేరం గ్రెటా థన్‌బెర్గ్‌ నోట్స్‌ను ఎడిట్‌ చేయడం. రెండేళ్ళ క్రితం కాశ్మీర్‌లో 40 మంది సైనికుల ప్రాణాలు హరించిన పుల్వామా ఉగ్రవాద ఘటనలో ప్రధాన నిందితులను ఇప్పటి వరకూ పట్టుకోలేకపోయిన మోడీ ప్రభుత్వం రైతు ఉద్యమానికి మద్దతు తెలియజేసినందుకు దిశా రవి లాంటి అమాయక బాలికలను మానసికంగా హింసించి 'ఉగ్రవాది' అనే ముద్ర వేసి జైలుకు పంపింది. వీరంటున్న ఖలిస్థాన్‌ ఉగ్రవాదం ఎప్పుడు తిరిగి లేచి వచ్చిందో ఎవరికీ తెలియదు. రైతు ఉద్యమం ప్రారంభమయ్యాకే ఖలిస్థాన్‌ పేరు ముందుకొచ్చింది. ప్రభుత్వమే దీన్ని సృష్టించింది. ప్రచారమూ చేస్తున్నది. ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని వాగ్దానం చేసి ఆ ఉగ్రవాదానికే ఊపిరి పోసిన ఘనత మోడీ ప్రభుత్వానిది.
పేద రైతులపై భస్మాసుర హస్తం
ప్రధాని మోడీ ఈ మధ్య ఒక వెబినార్‌లో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం కల్పించి అంతర్జాతీయ మార్కెట్‌లో మన వ్యవసాయ ఉత్పత్తుల గిరాకీ పెంచుతామని ప్రకటించారు. దీని వల్ల సన్న, చిన్నకారు రైతులు బాగా లాభపడతారని భ్రమ పెడుతున్నారు. వాస్తవానికి దేశంలో అతి పెద్ద ప్రైవేటు రంగం వ్యవసాయ రంగమే. జనాభాలో 50 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామ సీమల్లో 80 శాతం మందికి ఇదే జీవనాధారం. ప్రైవేటు రంగంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అంటే ఏమిటి అర్ధం? భూమి ప్రైవేటు ఆస్థిగా కలిగిన రైతులను వ్యవసాయ రంగం నుండి తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పడమే ఈ మూడు చట్టాల ఉద్దేశం. కాంట్రాక్టు వ్యవసాయం పేరుతో రైతుల భూములు, పంటలపై కార్పొరేట్‌ కంపెనీలకు ఆధిపత్యం వస్తుంది. రైతుల్నే లేకుండా చేసి రైతుల్ని ఉద్ధరిస్తామని చెప్పడం మోడీకే చెల్లింది. ఒప్పంద సేద్యం ద్వారా సేకరించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా ఎలాంటి పన్నులూ కట్టకుండా స్వేచ్ఛగా అమ్ముకోవడానికి, ఇష్టానుసారం సరుకులు నిల్వ పెట్టి ఏ ధరకైనా అమ్ముకోవడానికి ఈ చట్టాల ద్వారా కార్పొరేట్‌ కంపెనీలకు అధికారం వస్తుంది.
కార్పొరేట్‌ పోస్టర్‌బోయ్గా మోడీ
స్వదేశీ జపం చేస్తూ విదేశీ కంపెనీలకు సేవ చేస్తున్నది మోడీ ప్రభుత్వం. ఆయన చెప్తున్న ప్రైవేటు భాగస్వాములు అంబానీ, అదానీ లాంటి బలిసిన కార్పొరేట్‌ కంపెనీలు, మోన్‌శాంటో, వాల్‌మార్ట్‌, కార్గిల్‌ వంటి విదేశీ కంపెనీలు. వీరు దయతో గిట్టుబాటు ధర ఇస్తారట, ఇంకా దయ పెరిగితే బోనస్‌ కూడా ఇస్తారట. ఈ కంపెనీలకు సేల్స్‌మెన్‌ లాగా మోడీ అడ్వర్టయిజ్‌మెంట్‌ చేస్తున్నారు. ఆయన 130 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా కాకుండా గుత్త కార్పొరేట్‌ కంపెనీల ప్రచార కర్త (మోడల్‌) గా మాట్లాడుతున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు వ్యవసాయ రంగంలో ఇప్పటికే ఉన్నచోట ఏ రైతును అడిగినా చెప్తాడు ఈ కంపెనీల బాగోతమేమిటో. కంపెనీ సేద్యంతో నష్టపోయేది పండించే రైతులు, కొనుక్కుని తినే వినియోగదారులే.
గిట్టుబాటు ధరలకు చెల్లు చీటీ
వ్యవసాయ రంగంలో నూటికి డెబ్భై మంది సన్న, చిన్నకారు రైతులు. మరో 25 శాతం మధ్యతరగతి రైతులు. మిగిలిన 5 శాతం ధనిక రైతులు లేదా భూస్వాములు. భూస్వాములెవరూ వ్యవసాయం చేయడం లేదు. కానీ వారి చేతుల్లో ఉన్న భూమిని కౌలుకు ఇచ్చుకుంటారు. సన్న, చిన్నకారు రైతులు అప్పులు తెచ్చి సేద్యం చేస్తారు. కల్లంలోనే ధాన్యం అమ్ముకుంటారు. గిట్టుబాటు ధరలు లేకుంటే నష్టపోయి దివాళా ఎత్తుతారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నదీ ఈ తరగతి రైతులే. వీరిలో అత్యధిక భాగం కౌలు రైతులు. బ్యాంకు రుణాలు దొరకవు, ప్రైవేటు వడ్డీలు అధికం, నిల్వ పెట్టుకుని అమ్ముకునే సామర్ధ్యం ఉండదు. దూరప్రాంతాల మార్కెట్టుకూ తీసుకెళ్ళలేరు. స్వేచ్ఛనిచ్చినా ఉపయోగించుకోలేనంత బలహీనంగా ఉన్న తరగతి ఇది. వీరికి కావలసింది రక్షణ. దానికి సాధనం గిట్టుబాటు ధరల చట్టం. పేద రైతులను ఉద్ధరిస్తామంటున్న ఏ ప్రభుత్వమైనా ముందు చేయాల్సిన పని ఇది. కానీ మోడీ ప్రభుత్వం గిట్టుబాటు ధరలకు నోటిమాటగా హామీ ఇస్తుందట, కావాలంటే ఉదారంగా రాసిస్తారట, కానీ చట్టం మాత్రం చేయరట. మోడీ మాటల్లో నిజాయితీ లేదనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పిన ఘనులు వీరు. వ్యవసాయ చట్టాలు తెస్తున్నామంటూ అందులో కనీసం ఎక్కడా గిట్టుబాటు ధరల గురించిన ప్రస్తావన కూడా చేయలేదంటే వీటిని రైతు చట్టాలనాలా? లేక కార్పొరేట్‌ చట్టాలనాలా? ఇవి పదహారణాల కార్పొరేట్‌ చట్టాలు.
దేశభక్తి పేరుతో దేశాన్నే అమ్మేస్తున్నారు
ఎవరో దారిన పోయే దానయ్య ఏదో ఒక మాట అన్నాడని తన కుటుంబ జీవితాన్నే త్యజించాడు రాముడు. ఆ రాముడి పేరు చెప్పి ఓట్లు గుంజుకుని గెలిచిన మోడీ కోట్లాదిమంది ఘోషిస్తున్నా, ప్రభంజనంలా ఢిల్లీని చుట్టుముట్టినా తన శాసనాలను మాత్రం వెనక్కు తీసుకునేది లేదని మూర్ఖంగా పట్టుబట్టి కూర్చున్నాడు. వీరికి రాముడన్నా, దేవుడన్నా భక్తీ లేదు, భయమూ లేదు. కార్పొరేట్లకు ఈ దేశాన్ని నిలువునా అమ్మేయడమే వారి లక్ష్యం. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టినట్లుగా మొత్తం వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారు. మోడీ అబద్ధాల ఫ్యాక్టరీలో సత్యం, ధర్మం బలిపశువులుగా మారాయి. రాజ్యాంగ పునాది ధ్వంసమవుతోంది.
కేరళ ఆదర్శం
మోడీ నల్ల చట్టాలకు భిన్నంగా కేరళ వామపక్ష ప్రభుత్వం ఆదర్శ నిర్ణయాలు చేసి అమలు చేస్తోంది. స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం ధాన్యానికి క్వింటా రూ.2800 ఇచ్చిన ఘనత పినరయి విజయన్‌ ప్రభుత్వానికే దక్కుతోంది. కూరగాయలకు సైతం మద్దతు ధర ప్రకటించారు. కేరళ సహకార వ్యవస్థ మార్కెట్‌ వ్యవస్థకు ప్రత్యామ్నాయం.
పోరాట స్ఫూర్తి రగులుతోంది...
ఉద్యమం ప్రారంభమై వంద రోజులు దాటినా రైతులు ఏమాత్రం చలించలేదు. పోరాట స్ఫూర్తి తగ్గలేదు. కొత్త శక్తులు ఉద్యమంలో చేరుతున్నాయి. అలిసిపోకుండా వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొదట పంజాబ్‌ ఉద్యమం అన్నారు. కానీ అది హర్యానాకు, ఆ తరువాత ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ లకూ విస్తరించింది. రోడ్ల పైనే కాదు, గ్రామాల్లో వేల సంఖ్యలో స్త్రీలు, పురుషులు కిసాన్‌ పంచాయితీల్లో పాల్గొంటున్నారు. మొదట్లో బయటకు రాని రైతులూ ఇప్పుడు వీధుల్లోకి వస్తున్నారు. అగ్రకులాలు మొదలుకొని దళితుల వరకూ, హిందువులు మొదలుకొని ముస్లింల వరకు అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారితోనూ ఈ ఉద్యమం ప్రతిధ్వనిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకూ పాకింది. అయినా మోడీ మత్తు వదల్లేదు. పంజాబ్‌, హర్యానా స్థానిక ఎన్నికల్లో జనం మాడు పగులగొట్టారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వానికి రైతులు చెక్‌ పెట్టారు. ఏ హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు పెట్టి బిజెపి బలపడిందో, దళితులపై దాడులకు బరితెగించారో నేడు వారంతా ఐక్యం అయ్యారు. రోజులు గడిచేకొద్దీ ఈ ఉద్యమం మరింత బలపడుతున్నది. నాడు కురుక్షేత్రానికి ముందు ఐదు ఊళ్ళు ఇచ్చినా రాజీ పడతామన్న శ్రీకృష్ణ రాయబారాన్ని తిరస్కరించిన కౌరవులకు చివరకు హస్తిన కూడా మిగల్లేదు. మోడీ ప్రభుత్వానికి కూడా రైతులతో అదే గతి పడుతుంది. వ్యవసాయ చట్టాలు కావాలా? హస్తిన కావాలా? మోడీ తేల్చుకోవాలి.

                       వంద రోజుల ప్రభంజనం   - వి. శ్రీనివాసరావు/ వ్యాసకర్త సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు /