దేశంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం టీకాను ఉచితంగా సరఫరా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులో మాట (మన్ కీ బాత్) ఆదివారంనాడు నర్మగర్భంగా చెప్పారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అన్నారు కాని దాని ఖర్చు భరించే విషయం ప్రస్తావించలేదు. వ్యాక్సిన్ వ్యయం సంగతేమిటి అన్న చర్చ జనంలో జరుగుతుండగానే 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసువారు ప్రైవేటును ఆశ్రయించాలనీ, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఖర్చు భరిస్తే వారి నుండి సేవలు పొందవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ ఉదారంగా ప్రకటించింది. ఒకవైపు 18 నుంచి 45 ఏళ్ల వయస్కులకు టీకాలు వేసేందుకయ్యే ఖర్చు బాధ్యతను కేంద్రం విస్మరించి మరోవైపున ప్రధాని టీకా కార్యక్రమం కొనసాగుతుందని, ఎటువంటి వదంతులను నమ్మవద్దనీ గట్టిగా చెప్పడం జనాన్ని తప్పుదారి పట్టించడమే కదా! ఆర్థికంగా కునారిల్లిన రాష్ట్ర ప్రభుత్వాలను మరింత కుంగదీయడమే కదా! గత ఏడాది లాక్‌డౌన్ విధించాక చప్పట్లు చరచమని, పళ్లాలు కొట్టమని, కొవ్వొత్తులు వెలిగించమనీ ప్రజలకు పిలుపులిచ్చిన ప్రధాని కరోనా తీవ్రంగా విజృంభించిన అనంతరమే మందులు, ఆక్సిజన్, మౌలిక వసతుల గురించి మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. జనానికి అరచేతిలో వైకుంఠం చూపించడం, అనుభవంలో వాస్తవాలు మరోలా ఉంటే 'తూచ్....' అనడంలో మోడీని మించినవారు లేరు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామనడం దగ్గరి నుంచి పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనం కలగకపోతే నడి వీధిలో నన్ను ఉరి తీయండి వరకూ ఎన్నో మాటలు ఇలాంటివే!
కరోనాను జయించేశామనీ, విపత్తు నుండి ప్రపంచాన్ని భారత్ కాపాడిందనీ గొప్పగా ప్రకటించిన ప్రధాని మొన్నటి 76వ విడత మన్ కీ బాత్‌లో 'కరోనా మనందరి సహనానికి, శక్తికి, బాధల్ని తట్టుకునే సామర్ధ్యానికీ పరీక్ష పెడుతోంది' అన్నారు. 'గతంలో నేను లేదా మా ప్రభుత్వం తక్కువ అంచనా వేసి కరోనాను జయించేశాం అని చెప్పడం పొరపాటు' అని ప్రజల ముందు ఒప్పుకొని వుంటే ప్రధాని మాటకు విలువ పెరిగేది. కాని, అలా చెప్పేంత ధైర్యం, నిజాయితీ మోడీకి లేవు. పైపెచ్చు తమ తప్పులను జనం పైకి నెట్టేయడంలో ఆయన ముందుంటారు. 'ఎవరి బాధ్యతలను వారు సమర్ధవంతంగా నిర్వర్తిస్తే అతి త్వరలో ప్రస్తుత ఇబ్బందుల నుండి విముక్తి పొందుతాం' అని ఇప్పుడు చెబుతున్నారు. అసలు బాధ్యతలను సరిగా నిర్వర్తించనిది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా? ప్రజలా?
ఆక్సిజన్ కొరతతో కోవిడ్ బాధితుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. గత ఏడాది అక్టోబర్ లోనే దేశ వ్యాప్తంగా 162 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి టెండర్లు కూడా పిలిచింది. వీటిలో 33 మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయయి. మిగతావి పూర్తికాకపోవడానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కదా! ఆక్సిజన్ కొరత మరణాలకు కారణం ఎవరు? అలాగే వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి, త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి మోడీ సర్కారు తీసుకున్న చర్యలు పూజ్యం. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు గత ఏడాదే వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు పెట్టుబడులు సమకూర్చాయి. మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇటువంటి సహకారం ప్రభుత్వం నుండి 2021 ఏప్రిల్ 19 వరకు లభించలేదు. విదేశీ వ్యాక్సిన్లకు అవసరమైన అనుమతుల మంజూరులోనూ తీవ్ర జాప్యం చేస్తోంది. కీలకమైన పరిశోధన విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం చెప్పనలవి కాదు. కరోనా వైరస్‌కు మన దేశంలో వచ్చిన కొత్త మ్యుటేషన్‌గా చెప్పబడే బి.1.167 రకం వైరస్‌ను గత ఏడాది అక్టోబర్ లోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పది ల్యాబ్‌ల నెట్‌వర్క్‌తో ఏర్పాటైన జెనోమిక్స్ కన్సార్టియమ్ దీనిపై పరిశోధన చేస్తోంది. ఈ పరిశోధనలకు 115 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసింది కేవలం 80 కోట్ల రూపాయలే. అదీ 2021 మార్చి 31న! శాస్త్ర పరిశోధనలను నీరుగార్చిన సర్కారు కుంభ మేళాకు మాత్రం భక్తులను ఆహ్వానించి కోవిడ్ విజృంభణకు తలుపులు బార్లా తెరిచింది. అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వమే తన బాధ్యతలను విస్మరించి 'ఎవరి బాధ్యతలను వారు సమర్ధవంతంగా నిర్వర్తిస్తే...' అని సాక్షాత్తూ ప్రధాన మంత్రే సూక్తులు వల్లించడం వంచనకు పరాకాష్ట!










