వర్షాలు పడుతున్నాయి. ఖరీఫ్ పనులు ప్రారంభమవుతున్నాయి. రెండవ విడత కరోనా ఉధృతి కూడా తగ్గుతోంది. ఈ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి వలస కార్మికుల రాక కూడా పెరుగుతోంది. పొట్టపోసుకోవడం కోసమే వారు వస్తున్నా, వారి రాక మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకమే! తొలివిడత లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత వలసకార్మికులు కొద్దిరోజుల పాటు అందుబాటులో లేకపోవడంతో కొన్ని పరిశ్రమలు ప్రారంభం కాలేదు. కొన్ని ప్రాజెక్టుల పనులకు ఇదే గతి పట్టింది. దీంతో కొందరు కాంట్రాక్టర్లు ప్రత్యేక వాహనాలు పెట్టి మరీ వారిని తీసుకువచ్చారని వార్తలు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికులు పోషిస్తున్న పాత్రకు ఆ సంఘటనలే నిదర్శనం. అయితే, వీరి బతుకులకు ప్రభుత్వాలు ఇస్తున్న భరోసా దాదాపు శూన్యం! ఏ మాత్రం రక్షణ ఉన్నా తొలివిడత లాక్‌డౌన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా కనిపించిన సుదీర్ఘ పాదయాత్రల విషాద దృశ్యాలకు అవకాశం ఉండేదే కాదు! నిజానికి దేశంలో ఎంతమంది వలస కార్మికులు ఉన్నారన్న అంశంపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సరైన లెక్కలు లేవు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 5.6 కోట్ల మంది అంతరరాష్ట్ర వలసకార్మికుల ఉన్నారు. 2001 జనాభా లెక్కలతో పోలిస్తే ఇది 33 శాతం తక్కువ! తొలివిడత లాక్‌డౌన్ సందర్భంగా రైల్వేశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల ద్వారా దేశ వ్యాప్తంగా 50 లక్షల మంది వలసకార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళారు. అదే సమయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన ప్రశ్నకు దేశ వ్యాప్తంగా 26 లక్షల మంది వలసకార్మికులు కోవిడ్ వ్యాప్తి సమయంలో చిక్కుకుపోయారని కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ జవాబిచ్చారు! వీరిలో పదిశాతం మంది మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలను వినియోగించుకున్నారని తెలిపారు. జనాభా లెక్కలకు, రైల్వేశాఖ ప్రకటనకూ, కార్మిక శాఖ ముఖ్య కమిషనర్ ఇచ్చిన వివరణకూ ఏ మాత్రం పొంతన లేని విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీలకమైన ఈ విషయంలోనే స్పష్టత లేకపోతే పథకాల రూపకల్పన, అమలు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చీఫ్ లేబర్ కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది, తెలంగాణలో 1.84 లక్షల మంది వలస కార్మికులు కష్టాల పాలయ్యారు. నిజానికి వీరి సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది.
కష్టకాలంలో వలస కార్మికులను ఆదుకోవడంలోనూ, వారి కన్నీళ్లను తుడవడంలోనూ కేరళ దేశానికి ఆదర్శంగా నిలిచింది. వారిని అతిథి కార్మికులుగా పేర్కొన్న అక్కడి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు, వారి అలవాట్లకు, సాంప్రదాయాలకు అనుగుణంగా ఆహార ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2 వేలకు పైగా షెల్టర్లలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు, వలస కార్మికుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. నిజానికి కోవిడ్ -19 విజృంభణకు ముందే వలసకార్మికుల సంక్షేమంపై కేరళ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిది. పని ప్రదేశాల్లోనూ, వేతనాల్లోనూ వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంది.
ఇటీవల సుప్రీంకోర్టు కూడా వలస కార్మికుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినా, ఆ దిశలో ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం విచారకరం! ఇప్పటికైనా పని ప్రదేశాల్లో వలసకార్మికుల వివరాలను నమోదు చేసి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు, సామాజిక వంటశాలల నిర్వహణ, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత ఆరోగ్య సంరక్షణ వంటి చర్యలు తక్షణం అమలు చేయాలి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం లేబర్‌కోడ్‌లో కలిపివేసిన అంతరరాష్ట్ర వలస కార్మికుల (ఉపాధి-పని పరిస్థితుల)చట్టం-1979 లోని అంశాలను అమలు చేయాలి. మన రాష్ట్రానికి వచ్చిన 'అతిథి కార్మికుల' బాగోగులు మనం సవ్యంగా చూడగలిగినప్పుడే ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లిన మన ఆంధ్రా వలస కార్మికుల సంక్షేమం పట్టించుకోవాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరే నైతిక హక్కు మన ప్రభుత్వానికి వస్తుంది.










