
ప్రజాశక్తి - వేపాడ : మండలం సోంపురం సచివాలయం పరిధిలో గల నర్సిపల్లి మెట్ట వద్ద వలస కూలీలు సుమారు 50 కుటుంబాలు నేటికీ 40 సంవత్సరాలుగా జీవిస్తున్నారు. క్వారీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే వీరికి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వీరిలో కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న జగనన్న సామాజిక పింఛన్లు అర్హత ఉన్నప్పటికీ పొందలేకపోతున్నారు. పలుమార్లు రేషన్ కార్డులకు, సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నా ఫలితంల లేదని వాపోతున్నారు.
నిరుపేద కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అది సాధ్యం కావడం లేదని నర్సిపల్లి వెళ్లి చూస్తే అర్థమవుతోంది. ఇక్కడ నివసిస్తున్న వారికి తాగడానికి నీరు లేదు. నివాసానికి యోగ్యంగా ఉండే ఇళ్లులేదు. కరెంటు, వైద్య సౌకర్యం కూడా లేదు. వారి పిల్లలు చదువుకు కూడా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నారంటే వారి కష్టాలను అంచనా వేయవచ్చు. కొంత మంది తమ పిల్లలను చదివించాలని భావిస్తున్నా అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సోంపురం వరకూ నడుచుకుంటూ వెళ్లి చదువుకోవాలి. రోజూ ఆటో, బస్సుల్లో వెళ్లేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దీంతో వారి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.
కొవ్వొత్తుల వెలుగులోనే జీవనం
నర్సిపల్లిలో నివాసముంటున్న 40 కుటుంబాలకూ విద్యుత్తు సౌకర్యం లేదు. సాయంత్రం అవ్వగానే కొవ్వొత్తులను వెలుగించి ఆ వెలుగులోనే జీవిస్తున్నారు. కరెంటు లేకపోవడం వల్ల టివీ వంటి వినోద కార్యక్రమాలకు కూడా దూరంగా బతుకుతున్నారు. ఇదంతా మారుమూల కొండ ప్రాంతాల్లో జరుగుతుందనుకుంటే పొరపాటే. కేవలం సోంపురానికి 4కిలోమీటర్ల దూరంలో ఇంత తంతు జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం కొసమెరుపు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి విద్యుత్తు సౌకర్యం, పిల్లలకు పాఠశాల, వసతి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
అర్హత ఉంది..కానీ
నాకు అన్ని రకాలుగా ప్రభుత్వ పింఛను అందుకునేందుకు అర్హత ఉంది. వయస్సు కూడా 65 ఏళ్లకు పైగానే ఉంటాయి. కానీ ఇంత వరకూ పింఛను మంజూరు కాలేదు. నాలాంటి వారు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పింఛను మంజూరు చేయాలని కోరుతున్నాను.