
'శేఖర్! ఇదేనా నీ ఆఖరిమాట నీ నిర్ణయం మారదా?' కొడుకుని నిలదీశాడు శ్రీనివాసరావు.
'మార్చుకునేది అయితే దాని నిర్ణయం అనరు నాన్నగారూ' సూటిగా జవాబిచ్చాడు శేఖర్. ఆ మాటల్లో ఎంతో స్థిరత్వం, ధైర్యం తొంగి చూస్తున్నాయి.
'నాన్నగారు ఇంతగా చెబుతున్నారు కదా ఒక్కసారి ఆలోచించకూడదూ? ఆయన ఏం చేసినా మీ మంచి కోరే కదా చేసేది. ఈ ఒక్కసారికి ఆయన మాట వినచ్చు కదా?' తల్లి శ్రీవిద్య కొడుకు తప్పు చేస్తున్నాడేమో అని సున్నితంగా మందలించబోయింది.
'అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకొన్నాను అమ్మా! నా నిర్ణయం మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి!!' సున్నితంగా తల్లి అభ్యర్ధనను తోసిపుచ్చాడు శేఖర్.
'తప్పు నీది కాదు రా మాది. నిన్ను కని పెంచి ఇంతవాణ్ణి చేస్తే.. ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్లిపోతాను అనటం న్యాయమా?' ప్రాధేయపడినట్లే అంది తల్లి.
'అందుకనే మిమ్మల్నీ నాతో వచ్చి, ఉండమంటున్నా. కానీ మీరు మొండికేసి కుదరదు అంటున్నారు' తన తప్పు లేనట్లు సమర్ధించుకున్నాడు శేఖర్.
'నాదేముంది మీ నాన్నగారు ఏదంటే అదే' తన నిస్సహాయతను బయటపెట్టింది శ్రీవిద్య.
'నాన్నగారూ ఇప్పటికే ఒక తప్పు చేశారు. నాతో రానని మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నారు!' తండ్రి వంక చూస్తూ అన్నాడు శేఖర్.
'నేను తప్పు చేశానా? ఇంకో తప్పు చేస్తున్నానా? రాత్రింబవళ్ళు కష్టపడి మీరు సుఖంగా ఉండాలని ఎవరికీ లేని పెద్ద బంగళా, డబ్బు, కారు ఇవన్నీ సంపాదించటం నేను చేసిన తప్పా? నిన్ను అమెరికాలోనే ఉన్నతమైన కాలేజీలో డాక్టర్ చదివించడం తప్పా? ఇవేనా నేను చేసిన తప్పులు?' ఉక్రోషం పట్టలేక ఆవేశంగా మాట్లాడాడు.
'ఇవేవీ తప్పుకాదు నాన్నగారు. ఇవన్నీ ప్రతి తల్లిదండ్రీ తమ పిల్లల భవిష్యత్తు కోసం చేసేవి..' తండ్రి ఆవేదన చూసి, సౌమ్యంగా జవాబిచ్చాడు శేఖర్.
'మరి నేను చేసిన తప్పు ఏమిటో చెప్పరాదు?!' మరింత కోపంగా ప్రశ్నించాడు.
'మీరు తాతయ్య నాయనమ్మల్ని వదిలేసి, అమెరికా రావటమే మీరు చేసిన తప్పు' అసలు విషయం చెప్పాడు శేఖర్.
'ఓ అదా నేను చేసిన తప్పు. అయినా నేనేమీ వాళ్ళని వదిలి రాలేదు. మీ తాత ఇష్టపడి పంపిస్తే అమెరికా వచ్చాను. పెద్ద డాక్టర్‌గా పేరు, డబ్బు సంపాదించాను!' తానేమీ తప్పు చేయనట్లు సమర్ధించుకున్నాడు శ్రీనివాసరావు.
'ఏ తల్లీతండ్రీ పిల్లలు అమెరికా వెళ్లి చదువుకుంటాను అంటే.. వాళ్లు తమ తల తాకట్టు పెట్టైనా చదివిస్తారు. మనమే వాళ్ళ మనోభావాలు అర్థంచేసుకోవాలి!' చేసింది తప్పు అన్నట్లు మాట్లాడాడు శేఖర్.
'నేను చెబుతుంది నిజం. నేను ఇంటర్ పాస్ అవగానే నాన్నగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని, నా ఫ్యూచర్ ప్లాన్స్ అడిగారు. అమెరికా వెళ్ళి మంచి డాక్టర్ అవుతానన్నాను. సరేనన్నారు. నేను బలవంతం చేసిందీ లేదు, ఆయన బాధపడిందీ లేదు. ఇక డబ్బు అంటావా ముందుజాగ్రత్తగా ఉండడం వల్ల అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అమెరికా పంపి చదివించారు నాన్నగారు' జరిగింది శేఖర్‌కు తెలియదేమో అని వివరంగా చెప్పాడు శ్రీనివాసరావు.
'మరి బాబారుని ఎందుకు చదివించలేదు అమెరికా పంపించి?' ఇంకాస్త వివరంగా అడిగాడు శేఖర్.
'నాన్నగారు వాణ్ణి అడిగారు. కానీ వాడు అమెరికా రావటానికి ఇష్టపడలేదు' నా తప్పేమీ లేదని చెప్పటానికి ప్రయత్నించాడు శ్రీనివాసరావు.
'అంతేనా డబ్బులు లేక బాబారుని పంపలేదా?' అసలు విషయం గుర్తుచేశాడు శేఖర్.
'వాడు వస్తాను అని గట్టిగా అనుంటే నేను నా సహాయం చేసేవాడిని. అప్పటికే నేను ఉద్యోగంలో చేరాను కదా! తాతగారి డబ్బుతో పనేముంది?' ఆర్థిక సమస్యలు లేనట్లు చెప్పుకొచ్చాడు శ్రీనివాసరావు.
'రాకపోవడమే మంచిదయ్యిందిలే! ఇవాళ బాబాయి మన ఊరిలో మంచిపేరు సంపాదించుకున్నాడు. రేపోమాపో అధికారపార్టీ వాళ్ళు బాబారుకి ఎమ్మెల్యే టిక్కెట్ కూడా ఇద్దామని అనుకుంటున్నారట!' అమెరికా రానందుకు బాబాయికి ఏమీ నష్టం లేదు అన్నట్లు చెప్పాడు శేఖర్.
'నాకు మాత్రం ఇక్కడ మంచి న్యూరోసర్జన్‌గా పేరు రాలేదా ఏమిటి? నా అపాయింట్‌మెంట్ కోసం జనం వారం ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు!' గర్వంగా చెప్పాడు శ్రీనివాసరావు.
'నీకోసం కూడా జనం వస్తారు నాన్న, కానీ అది కేవలం వాళ్ల అవసరం కోసం. మీరూ వాళ్ల అవసరాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు. మీది అంతా కేవలం ఒకరి అవసరం ఒకరు తీర్చుకోవడానికి సాగే మానవ వ్యాపారం' డాక్టర్లు ఏవిధంగా పేషెంట్లను దోచుకుంటున్నారో చెప్పకనే చెప్పాడు శేఖర్.
'మీ బాబాయి దగ్గరకు మాత్రం జనం ఊరికినే వస్తున్నారా? వాళ్ల అవసరం కోసమే వస్తున్నారు!' కొడుకుని ఏమీ అనలేక తమ్ముడు అన్నాడు. మళ్లీ తనే కొనసాగిస్తూ 'ఆ అలగా జనం కోసం ఆస్తి మొత్తం కరగపెట్టాడు. ఎందుకొచ్చిన రాజకీయాలంటే వినకుండా ఊరి జనం కోసం ఇల్లూవాకిలీ పట్టకుండా తిరుగుతుంటాడు!' తమ్ముడు చేస్తోంది తప్పు అన్నట్టు మాట్లాడాడు శ్రీనివాసరావు.
'మీరు రాజకీయాలు అంటున్నారు.. బాబారు ప్రజాసేవ అంటున్నాడు!' బాబారుని వెనకేసుకొచ్చాడు శేఖర్.
'ఏదో ఒకటి.. అలగా జనం చుట్టూ తిరగడానికి. నేను చేసేది నిజమైన ప్రజాసేవ' తనని తక్కువ చేస్తున్నాడని కొడుకుతో కోపంగా అన్నాడు.
'మీది ప్రజాసేవ ఎలా అవుతుంది నాన్నగారూ? ప్రతిదానికి మీరు ఒక రేటు పెట్టి పేషెంట్ దగ్గర వసూలు చేస్తున్నారు. మిమ్మల్ని కేవలం వాళ్ళు ఒక బిజినెస్‌గానే చూస్తున్నారు. వాళ్లకు మీ మీద ఏమాత్రం కృతజ్ఞత, గౌరవం లేదు' అని చెప్పాడు శేఖర్.
'ఇప్పుడు వాళ్లు అందరూ వచ్చి నాకు సలాం చేయాలా? అంత మాత్రాన నా గౌరవానికి ఏమీ తక్కువ లేదు. సొసైటీలో నాకంటూ ఒక స్టేటస్ ఉంది. లేకపోతే అమెరికా తెలుగు సంఘానికి నన్ను సెక్రెటరీగా అనుకోరుగా?!' శేఖర్ వాదన తప్పని నమ్మించజూశాడు శ్రీనివాసరావు.
'అవన్నీ మీరు సంపాదించిన డబ్బుతో వచ్చినాయి. కానీ నిజంగా మీ మీద ఉన్న గౌరవంతో వచ్చినవి కావు!' శేఖర్ మాటలతో శ్రీనివాసరావుకి కోపం నషాళానికి ఎక్కింది.
'మరి ఆ అలగా జనం మాత్రం మీ బాబారుకి ఏం గౌరవం ఇస్తున్నారు? ఏం ఉద్ధరిస్తున్నారు?' అరిచినంత పనిచేశాడు శ్రీనివాసరావు.
'ఒక్కసారి గత ఏడాది తాతగారు చనిపోయినప్పుడు ఏం జరిగిందో గుర్తు చేసుకోండి!'
గతంలోకి తీసుకెళ్ళాడు శేఖర్ శ్రీనివాసరావుని.
***
నాన్నగారు పోయారని తమ్ముడు ఫోన్ చేయగానే హుటాహుటిన ఉన్నఫళంగా కుటుంబంతో సహా బయలుదేరిపోయాను. హైదరాబాద్ వరకూ ఫ్లైట్లో వెళ్లినా అక్కడి నుంచి కారులో ఊరు వెళ్లాలంటే కనీసం ఐదు గంటలు పడుతుంది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగగానే మా కోసం రెండు ఇన్నోవాలు రెడీగా ఉన్నాయి. దారి మధ్యలో అడిగితే తమ్ముడు చెబితే ఊర్లో జనాలు తమ సొంత ఖర్చుతో మాట్లాడి, వారిని పంపించారని మా కోసం వచ్చినవారు చెప్పారు.
ఊరు మొత్తం ఐదారు వందల కుటుంబాలు ఉంటాయి. అన్నీ మెయిన్ రోడ్డుకి రెండువైపులా ఆనుకునే ఉంటాయి. మేము ఊరు చేరుకునేసరికి దారంతా జనంతో నిండిపోయి ఇన్నోవా ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.
తమ్ముడు, వాడి భార్యాపిల్లలు నాన్నగారి శవం పక్కనే కూర్చున్నారు. ఊర్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి నాన్నగారికి నమస్కారం చేసి, తమ్ముడి దగ్గరకు వచ్చి పలకరించి వెళ్తున్నారు. నేను ఎవరో తెలియకపోవడం వల్ల ఒకరిద్దరు తప్ప, ఎవరూ నన్ను పలకరించలేదు.
నేనూ చిన్నగా తమ్ముడు పక్కనే చేరి, వచ్చిన వారిని పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాను. తమ్ముడు కూడా చాలామందిని నాకు పరిచయం చేశాడు. అందరూ ఆ వూరి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారూ ఉన్నారు.
నాన్నగారు అంటే అదే ఊరిలో హైస్కూల్ హెడ్మాస్టారుగా పనిచేసి, అక్కడే రిటైర్ అయ్యారు. కాబట్టి ఆ ఊరిలో అందరికీ చిరపరిచితులే. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు అంటే.. అవన్నీ తమ్ముడి పరిచయాలు.
నాన్నగారి చేతికి ఎముకలేనట్లు అడిగినవారికి లేదన్నట్లు సాయం చేస్తే, తమ్ముడు అసలు ఒంట్లోనే ఎముక లేనట్లు అడగనివారికీ నేనున్నానని ఆదుకునేవాడు. అందుకునే ఇంత మంది వచ్చారు.
మా ఎవరి ప్రమేయం లేకుండానే ఊర్లో వాళ్లు నాన్నగారి అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లూ చేశారు. పాడె కట్టడం దగ్గర్నుంచి, చివరికి స్మశానంలో చితి ఏర్పాటు చేయడం వరకూ అన్నీ వాడే చూసుకున్నాడు. ఇంటికి పెద్ద కొడుకుగా నాన్నగారికి తలకొరివి పెట్టడం ఒక్కటే నేను చేసింది. పెద్ద దినానికి చాలా ఖర్చు అవుతుందని భయపడ్డా.. ఎందుకంటే నాన్నగారి అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళందరినీ పిలవాలంటే కనీసం రెండు వేల మంది అవుతారు. వాళ్లందరికీ భోజనాలు పెట్టాలంటే కనీసం ఐదారు గంటలు అవుతుంది. నా ఆర్థిక స్తోమతకి అది పెద్దమొత్తం కాకపోయినా కొంతమందికి వండి వార్చడం కష్టమనిపించింది. కానీ దేవుడే పంపినట్లు నాన్నగారి దగ్గర చదువుకున్న మా ఊరి కుర్రవాళ్ళు అందరూ వచ్చి ఆయన పెద్దకర్మ చేసే అవకాశం ఇవ్వమని అడిగారు.
కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు నాకూ పెద్ద భారం తగ్గిపోయిందని సంతోషించి, వెంటనే వాళ్ళ మాటకి ఒప్పేసుకున్నాను.
పైసా ఖర్చు లేకుండా అన్నీ ఊళ్ళోవాళ్ళు దగ్గరుండి చూసుకున్నారు. బ్రహ్మాండంగా నాన్నగారి కార్యక్రమం శిష్యులే జరిపించారు.
ఆ నిమిషం నాకు అనిపించింది నాన్నగారు ఎంతో మంచిగా ఉండి, అందరికీ తోచిన సాయం చేయబట్టే కదా ఎంతమంది ముందుకొచ్చి తలా ఒక చెయ్యి వేసి, గొప్పగా కార్యక్రమాన్ని పూర్తిచేశారు.
***
గణగణమని సెల్ఫోన్ మోగడంతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు శ్రీనివాసరావు.
ఎవరా అని సెల్‌ఫోన్లో నెంబర్ చూస్తే అది తన కొలీగ్, హార్ట్ స్పెషలిస్ట్ రామ్మూర్తిది.
ఈ వేళప్పుడు ఏమిటబ్బా! అనుకుంటూ ఫోన్ ఎత్తాడు.
అవతల మిసెస్ రామ్మూర్తి ఏడుస్తూ 'రామ్మూర్తి గారు ఓ గంట క్రితమే హార్ట్ ఎటాక్‌తో చనిపోయారండీ!' అని చెప్పి, ఫోన్ పెట్టేసింది.
రామ్మూర్తి, శ్రీనివాస్ ఒకేసారి ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరూ తమ వృత్తుల్లో మంచిపేరు సంపాదించడమే కాక, డబ్బూ బాగా సంపాదించారు. ఒకేసారి పక్క పక్కనే ఇళ్లూ కట్టుకున్నారు. అలాంటి రామ్మూర్తి పోయాడన్న వార్త వినగానే శ్రీనివాసరావుకి ఒక్క నిమిషం కాలూ చేయీ ఆడలేదు. భార్య శ్రీవిద్యని, కొడుకు శేఖర్‌ని తీసుకుని, రామ్మూర్తి ఇంటికి బయల్దేరాడు.
***
శ్రీనివాసరావు రామ్మూర్తి ఇంటికి వెళ్లేసరికి ఇంకా రామ్మూర్తి శవం వన్ వన్ బెడ్‌రూమ్‌లోనే ఉంది. రామ్మూర్తికి ఇద్దరూ ఆడపిల్లలే. భార్యాపిల్లలు మంచం చుట్టూ చేరి ఏడుస్తున్నారు. శ్రీనివాసరావుని చూడగానే రామ్మూర్తి భార్య మంచం మీద నుండి లేచి, శ్రీనివాసరావు వంక చూస్తూ 'మీరన్నా లేపండి అన్నయ్యగారూ!' అంటూ ఏడుస్తుంది.
రామ్మూర్తి భార్యను పట్టుకోమని శ్రీవిద్యకు సైగచేసి, శ్రీనివాసరావు మరోసారి రామ్మూర్తి పల్స్ చెక్ చేశాడు. ఒక రాత్రి మధ్యలోనే హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నాడు. కొడుకు శేఖర్‌తో 'జరిగింది హాస్పిటల్‌కి ఫోన్ చేసి చెప్పు. అలాగే లోకల్ పోలీసులకీ మిగతా వాళ్ళకీ ఫోన్ చెరు! ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తిచేయి' అని ఆదేశించాడు.
'అలాగే నాన్నగారు' అంటూ అక్కడి రూల్స్ ప్రకారం ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్లకు ఫోన్ చేసే పనిలో మునిగిపోయాడు శేఖర్.
ఇప్పటిదాకా ఒకరినొకరు వాదించుకునే తండ్రీకొడుకులు వీళ్లేనా అని శ్రీవిద్య ఆశ్చర్యపోయింది.
'ఏమ్మా ఇండియా తీసుకెళ్దామా? ఇక్కడే ముగిద్దామా?' ప్రశ్నించాడు శ్రీనివాసరావు మిసెస్ రామ్మూర్తి వంక చూస్తూ.
'అక్కడ మాకు ఎవరున్నారు అన్నయ్యా? ఆయన తరుపు వాళ్ళు, నా తరపు వాళ్ళు ఎవరూ ఇండియాలో లేరు. ఆయనకు ఒక్కతే చెల్లెలు. ఆవిడ కుటుంబం ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది. మా అన్నయ్య లండన్లో డాక్టర్. ఆయన అక్కడే స్థిరపడ్డాడు. కుటుంబంతో సహా!' అంటుంటే.. 'మరి వాళ్ళకి ఈ వార్త తెలియజేశారా?' అడిగాడు శ్రీనివాసరావు. 'చెప్పాను అన్నయ్యగారూ ఇప్పటికిప్పుడు రావాలంటే వీసా దొరకడం కష్టం. పెద్దకర్మకు వస్తానన్నాడు!' అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడ పరిస్థితి చూసి శ్రీనివాసరావుకీ జాలి వేసింది. అప్రయత్నంగా కళ్ళలో నుండి నీళ్ళు కారాయి. ఇదంతా గమనిస్తున్న శ్రీవిద్య శ్రీనివాసరావు భుజం మీద చెయ్యి వేసింది కంట్రోల్ చేసుకోమన్నటు.్ల
ఇంకా రామ్మూర్తి శవాన్ని చూడటానికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని శ్రీనివాసరావు 'శేఖర్ అంబులెన్స్‌కు కబురుపెట్టు. అలాగే క్రిమినేషన్ సెంటర్కి కూడా!' అని మాట పూర్తిచేసే లోపే
'అన్నీ రెడీ చేశాను నాన్నగారూ!' అన్నాడు శేఖర్.
అంబులెన్స్‌లో రామ్మూర్తి శవాన్ని ఎక్కించి, శేఖర్ ఎక్కి కూర్చున్నాడు.
మిగిలిన వాళ్ళందరూ కార్లలో అంబులెన్స్‌ను అనుసరించారు.
***
క్రిమినేషన్ పూర్తవ్వగానే రామ్మూర్తి భార్యాపిల్లలను, తల్లి శ్రీవిద్యను కలిపి ఇంటికి పంపించి వేశాడు శేఖర్.
మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తిచేయడానికి శ్రీనివాసరావు, శేఖర్ మాత్రం అక్కడే ఉండిపోయారు. శేఖర్ ఫార్మాలిటీస్ పూర్తిచేస్తూ ఉంటే అక్కడే పక్కన కూర్చున్న శ్రీనివాసరావు ఆలోచనలోపడ్డాడు. ఎంతో పేరు, డబ్బు, బంధువులు అందరూ ఉండీ, ఎవరూ లేని అనాధలా ఇవ్వాళ రామ్మూర్తిని సాగనంపాల్సి వచ్చింది. ఇక్కడ అంతా అవసరాలతోనే బతుకుతున్నారు అన్న శేఖర్ మాటలు గుర్తుకొచ్చాయి.
'ఇదే రామ్మూర్తి ఇండియాలో హాస్పిటల్ పెట్టి, అక్కడ మంచిపేరు తెచ్చుకుని ఉంటే తన అంతిమయాత్ర వందల మంది జనం మధ్య జరిగి ఉండేది. కానీ డబ్బు కోసం వాళ్ళందర్నీ వదిలేసి, ఇంతదూరం వచ్చాడు. రామ్మూర్తీ నేనూ నాలుగు డబ్బు సంపాదించవచ్చని కన్నవాళ్ళనీ ఉన్న ఊరినీ వదిలి, ఇక్కడి దాకా వచ్చాను. కానీ నలుగురు మనుషుల్ని పోగొట్టుకుంటున్నాం అనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాను!' అని శ్రీనివాసరావు మనసులో బాధపడడం మొదలుపెట్టాడు.
అన్నీ పూర్తయిన తర్వాత శేఖర్ తండ్రి దగ్గరకు వచ్చి 'ఇక వెళ్దామా నాన్నగారూ!' అన్నాడు బయలుదేరినట్లు.
'వెళ్దాం.. నేరుగా ఇండియాకి వెళ్దాం!' అన్నాడు శేఖర్‌తో శ్రీనివాసరావు.
'ఇండియాకా?!' ఆశ్చర్యపోయాడు శేఖర్.
'అవును శేఖర్! ఈ వలస బతుకులు మనం బతకాల్సిన అవసరం లేదు. మన ఊర్లో మన వాళ్ళతో కలిసి బతుకుదాం. నేను చనిపోతే నువ్వు ఒక అనాధలా అంబులెన్స్‌లో వెళ్లకూడదు. నా కోసం వచ్చే మన ఊరి వాళ్ళ చేతుల మీదుగా నా చివరి ప్రయాణం సాగాలి!' అన్నాడు శ్రీనివాసరావు.
'నాన్నగారిలో ఇంత త్వరగా మార్పు వస్తుందని ఊహించలేదు. దీనికంతటికీ కారణం రామ్మూర్తి గారే!' మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ తండ్రి భుజం మీద చెయ్యి వేసి, 'అలాగే వెళ్దాం పదండి!' అంటూ తండ్రిని లేవదీశాడు శేఖర్.
* ఈదర శ్రీనివాసరెడ్డి, 7893111985