Aug 19,2023 22:01

ఫొటో : చెక్కును అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

వలంటీర్ల కుటుంబాలకు అండగా జగనన్న
ప్రజాశక్తి మర్రిపాడు : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తున్న వలంటీర్ల కుటుంబాలకు వైసిపి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. ఎఎస్‌పేట మండలం అనుమసముద్రం గ్రామంలో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కప్పల బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.5లక్షల చెక్కును శనివారం ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలోని నివాసంలో అందచేశారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ నియోజకవర్గం ఎఎస్‌పేట మండలానికి చెందిన ఇద్దరు వలంటీర్లకు ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల వంతున ఒక్కొ కుటుంబానికి సహాయం చేసినట్లు, ఇప్పుడు అదే మండలానికి చెందిన వలంటీర్‌ కప్పల బాబు రెండు సంవత్సరాల క్రితం మృతి చెంది వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిగా లేదని మండల నాయకులు తమ దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం మంజూరు చేయించామన్నారు. వలంటీర్లు గౌరవ వేతనం అందుకుంటూ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందుతున్న వలంటీర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు.