ప్రజాశక్తి-కందుకూరు :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల విస్మరించి, అధిక ధరలను కరెంట్ చార్జీలను పెంచుతూ ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నాయని సిపిఎం వలేటివారిపాలెం మండల ఇన్చార్జి జీవీబీకుమార్ విమర్శించారు. సోమవారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో వలేటివారిపాలెం తహసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది. ధర్నాకు సిపిఎం మండల కార్యదర్శి మాదాల రమణయ్య అధ్యక్షత వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం నేత జీవీబీకుమార్ మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోము, ధరలు తగ్గిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అన్న పాలకులు ఆచరణలో తమ వాగ్దానాలను విస్మరించి ప్రజలపై భారాలు వేయటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో 7సార్లు కరెంట్ చార్జీలను పెంచిందన్నారు. సర్ చార్జీలు,ట్రూ అప్, అదనపు చార్జీల పేరుతో మూడు రెట్లు రేట్లు పెంచింది అన్నారు. ఇది సరికాదు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యవసర ధరలను అదుపు చేయాలని కోరారు. అంకభూపాలపురంలో 1984లో అప్పటి ప్రభుత్వం 60ఎకరాలు దళితులకు డీకే పట్టాలు ఇచ్చిందని, కానీ ఆన్లైన్లో అగ్రవర్ణ రైతులు ఆ పొలాలలో ఉన్నారని అన్నారు. స్థానిక రెవిన్యూ అధికారులు జోక్యం చేసుకొని రిసర్వే లో ఈ భూములన్నీ దళితులకి చెందేటట్లు చేయాలని కోరారు. అనంతరం మండల తహసిల్దార్ కె వి బి టి సుందరమ్మ కు వినతి పత్రం ఇచ్చి సమస్యని వివరించారు. వెంటనే విచారణ జరిపి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు దువ్వూరి జాన్, డిఎం రాయుడు,పర్రె భాస్కరరావు, దార్ల మాల్యాద్రి, మంగి లాజరు, మల్లెల అంకయ్య ,ఎం ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు










