Jan 28,2021 07:45

గణతంత్ర దినోత్సవం నాడు మొక్కవోని రైతుల పోరాట పటిమతో మాటలో, చేతలో అసలు గణతంత్ర స్వభావం ఎంత వున్నదో తేటతెల్లమైంది. పౌరుల స్వేచ్ఛకీ, వారు నిరసన తెలిపే హక్కులకీ కచ్చితమైన హామీ లేని చోట గణతంత్రం ఎండమావి. రైతుల నిరసన ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి దానిని విఫలం చేసే పన్నాగాలకు తెరదీయడం కౌటిల్యం. అనుమతించిన దారుల్లో కూడా అడ్డంకులు కల్పించిన ఫలితంగానే భిన్నమైన దారుల్లో నిరసనర్యాలీలు జరిగాయి. ముందస్తుగా పేర్కొన్న దారుల్లో ర్యాలీ కొనసాగడానికి అడ్డంకులు కల్పిస్తే ఇతర మార్గాల్ని ఎంచుకోడం రైతులకు అనివార్యమైంది. ప్రధాన స్రవంతి మీడియా ఈ నిజాల్ని చెప్పలేదు, చూపలేదు. రైతులే నిబంధనల్ని అతిక్రమించి కొత్తదారుల్లోకి వచ్చారని పోలీసులు చెప్పడం, మీడియా అదే వల్లించడం చూసాం. కానీ వారు కొత్తదారుల్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఒకటి రెండు వెబ్‌సైట్లలో తప్ప ఎక్కడా కనిపించదు.
 

అబద్ధాల హంగామా
గణతంత్ర దినోత్సవం నాడు మోడీ ధరించిన తలపాగాకు ఇచ్చినంత ప్రాధాన్యం రైతుల నిరసనరావాలకు ఇవ్వలేదు మీడియా. వారి ఆందోళనల్లోని నిజాయితీని, క్రమశిక్షణనీ సరిగ్గా కవర్‌ చేయలేదు. కాగా, అబద్ధాల ప్రచారానికి ఒడిగట్టడం అత్యంత హేయం. ఎర్రకోటపై జాతీయజెండాని అవమానించినట్టుగా చూపారు, చెప్పారు. అలాగే ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగురవేసినట్టు తప్పుడు ఫుటేజీల్ని పదేపదే చూపారు. ఆందోళనకారులు జాతీయజెండాని అవమానించారనే దురుద్దేశ పూర్వక వ్యాఖ్యానాలకు మీడియాహౌస్‌ల్లో కూర్చున్నవారు తెగబడ్డారు. నకిలీ ఫోటోలతో, నకిలీ వీడియో క్లిప్‌లతో రైతుల ఆందోళనపై విషం కక్కడం చానళ్ళలో కనిపించింది. నిజానిజాలు ఏవో తెలియని వీక్షకులు జాతీయజెండాకు అవమానం జరిగిందని బాధపడతారు. అప్పటివరకు రైతుల ఆందోళనల పట్ల సానుభూతి కలిగిన వారు కూడా జాతీయజెండాని అవమానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వ్యవసాయదారులు తప్పుడు పద్ధతుల్లోకి దిగారని అనుకుంటారు. ప్రభుత్వానికి కావాల్సింది ఇదే. కనుక పాలకుల అభిమతానికి అనుగుణంగా నకిలీ వార్తలతో గందరగోళం సృష్టించాయి కొన్ని పేరొందిన చానళ్ళు.
రైతుల నిరసనల్ని ప్రత్యక్షంగా కవర్‌ చేసిన కొందరు రిపోర్టర్లు, ప్రత్యామ్నాయ వార్తల్ని ఇచ్చే వెబ్‌సైట్లు ఏది నకిలీనో, ఏది అసలయినదో చూపితే గానీ నిజాలు ఏమిటో తెలియలేదు. ఎర్రకోట చెంత అసలు ఖలిస్థాన్‌ జెండాలు ఎగురవేయలేదు. అలాగే జాతీయజెండాని ఎవరూ తొలగించలేదు. ఎర్రకోట వద్ద కొందరు రైతులు తమ జెండాతోపాటు, నిశాన్‌సాహిబ్‌ జెండాల్ని ఎగురవేశారు. ఇది కూడా బిజెపికి వత్తాసునిచ్చే దీప్‌సిద్ధూ కుట్రపూరిత నిర్వాకం ఫలితమని తేలిపోయింది. ఎర్రకోట వద్ద జెండాలు ఎగురవేయాలనే ఆలోచన తమ ప్రణాళికలోనే లేదని రైతు సంఘాలు విస్పష్టంగా తేల్చి చెప్పాయి. ఈ అసలు నిజాలు వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు అబద్ధాలు హోరెత్తాయి. కిసాన్‌పరేడ్‌ స్ఫూర్తి జనంలోకి వెళ్ళకుండా కార్పొరేట్‌ మీడియా విషపూరిత పన్నాగాలకు ఇది పరాకాష్ట.
 

ప్రాధాన్యం ఏది?
దేశ రాజధానిలో లక్ష ట్రాక్టర్లతో తలపెట్టిన కిసాన్‌పరేడ్‌ ప్రభుత్వ మొండి వైఖరి ఫలితమన్నది తొలుత గ్రహించాలి. కిసాన్‌ర్యాలీ హింసాత్మకంగా మారడానికి రైతులదే బాధ్యత అన్నట్టు మీడియా లోని విశ్లేషకులు, సోకాల్డ్‌ మేధావులు మాట్లాడుతున్నారు. చర్చల పేరిట కాలయాపన చేస్తూ రైతుల సహనానికి పరీక్ష పెట్టిన మోడీ ప్రభుత్వ తీరుని విస్మరిస్తున్నారు. అసలు వ్యవసాయ చట్టాలకు సంబంధించి తొలుత ఆర్డినెన్స్‌ జారీ చేయడమే తప్పు. తర్వాత ఎలాంటి చర్చకు తావు ఇవ్వకుండా బిల్లులను పార్లమెంటులో అక్రమపద్ధతుల్లో ఆమోదించడం అప్రజాస్వామికం. రైతుల మనోగతం, రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోడానికి కేంద్రం ప్రయత్నించలేదు.
ఈ సువిశాల భారతదేశంలో వ్యవసాయం ఎక్కడికక్కడ విలక్షణమైంది. దేశమంతటికీ ఒకటే విధానం సరితూగదు. కనుక వ్యవసాయరంగంలో సంస్కరణలు అవసరమైతే ఆయా రాష్ట్రాలలో మొదట చర్చ జరగాలి. భౌగోళిక వాస్తవాల్ని, స్థానిక అవసరాల్ని గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇదంతా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. దీనిని పక్కకు నెట్టి ఏకపక్షంగా మూడు వ్యవసాయ చట్టాలని చేయడం గణతంత్ర, ప్రజాతంత్ర ప్రభుత్వం చేయకూడని పని. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి తను అనుకున్న రీతిన సంస్కరణల పేరిట వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే చట్టాలకు ఒడిగట్టింది. ఈ అప్రజాస్వామిక నిర్వాకం మీద ప్రధాన స్రవంతి మీడియాలో సాధికారికమైన కథనాలు కనబడవు, వినబడవు. పాలకుల మాటలు వల్లించే చిలుకలుగా మారిపోయాయి పత్రికలు, చానళ్ళు. గణతంత్ర దినోత్సవం నాడు కిసాన్‌ర్యాలీ క్రమాన్ని వక్రీకరిస్తూ ప్రసారం చేసిన వార్తలు, వార్తాకథనాలు ఈ దిగజారుడుతనాన్ని బాహాటంగా తెలియజెప్పాయి.
 

నిజాలకు చోటు ఏది?
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల దీర్ఘకాలిక ఆందోళనల్ని ప్రధాన స్రవంతి మీడియా ముందు నుంచి సరిగా పట్టించుకోలేదు. తక్కువ చేసి చూపడం సాధ్యం కాని పని అన్నది రోజురోజుకీ పెరిగిన ఆందోళనల తీవ్రతతో బోధపడింది. దీనితో వక్రీకరణలకు దిగజారింది. రైతుల ఆందోళనల్ని వ్యతిరేకించే వారి మాటలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలు ఎందుకు అసంబద్ధమైనవో సహేతుకంగా చెబుతున్నవారికి తగినంత చోటు ఇవ్వలేదు. రైతులది న్యాయమైన డిమాండ్‌ అయినప్పటికీ వారి మాటలకీ, ఆందోళనలకీ మీడియా చెప్పుకోదగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. గత రెండు నెలల కాలంలో అధిక రేటింగ్‌ కలిగిన టీవీ చానళ్ళు, వెబ్‌సైట్లు, ప్రింట్‌ మీడియా పత్రికలు ఎలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇచ్చాయో, రైతుల నిరసనలకు ఏమాత్రం చోటు కల్పించాయో గమనించాలి. వార్తలు కాని వాటిని వార్తలుగా ఇవ్వడం ద్వారా నిజాలకు పాతర వేసే వ్యూహం అమలవుతున్నది. ఆస్ట్రేలియా-ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌కు ఇచ్చినంత ప్రాధాన్యం వ్యవసాయదారుల ఆందోళనలకు లభించకపోవడం గమనార్హం.
 

అసలైన వార్తలకు ప్రమాదం
లక్ష ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం జనాలకు ఉంటుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతుల ఆందోళనల్ని నీరుగార్చాలనుకుంది. దానికి తగ్గట్టుగానే వ్యవహరించింది. అది పాలకవర్గ స్వభావం. అయితే నిజాలు చెప్పాల్సిన మీడియా సైతం పాలకగణాలకు అనువుగా వ్యవహరించడం అసంబద్ధం.
మీడియా స్వేచ్ఛ, స్వతంత్రత, స్వయంప్రతిపత్తి అన్నవి బూటకమని రోజురోజుకీ తెలిసిపోతున్నది. కాషాయ పరివారం చెప్పిందే వార్త అన్నట్టుగా తలాడించే స్థితికి దిగజారింది ప్రధాన స్రవంతి మీడియా. ఫలితంగా తొలుత తప్పుడు వార్తలే చెలామణయ్యాయి. క్రమక్రమంగా జనం పక్షం నిలబడే వెబ్‌సైట్లు - నకిలీ ఫోటోలు, వీడియాలు ఏవో, అసలైన ఫొటోలు, వీడియోలు ఏమిటో చెబితే గానీ తెలియలేదు. నిజమైన వార్తల కోసం పాపులర్‌ చానళ్ళ మీద ఆధారపడకూడదని మరోసారి జనాలకు తెలియజెప్పిన ఉదంతమిది. వైర్‌, ద ప్రింట్‌, క్వింట్‌ వంటి వెబ్‌సైట్లని, నిజాయితీ గల జర్నలిస్టుల ట్విట్టర్లను అనుసరిస్తే గానీ అసలు వార్తలు తెలియలేదు. రైతుల ఆందోళనల్ని అప్రతిష్ట పాల్జేసే కుట్రపూరిత పర్వానికి కార్పొరేట్‌ మీడియా వత్తాసుగా నిలిచిందని చివరకు బోధపడింది.
 

అప్రమత్తత తప్పనిసరి
సున్నితమైన, ఉద్వేగపూరితమైన అంశాలకు సంబంధించి నిజానిజాలు పరిశీలించకుండా వార్తలు ప్రసారం చేయరాదన్నది పాత్రికేయ ధర్మం. ఈ విలువల్ని త్రోసిరాజని సంచలనం కోసం, భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం కోసం నకిలీ వార్తల్ని పేరొందిన చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి. వీటి ఆధారంగా సోషల్‌మీడియాలో విద్వేషపూరిత ప్రచారం సాగుతున్నది. బాధ్యతతో, విలువలతో వ్యవహరించాల్సిన మీడియానే కుటిలవిధానాల్ని అనుసరించడం క్రూర వాస్తవికత. ఈ నేపథ్యంలో నిబద్ధ జర్నలిస్టులు, మీడియా నిర్వాహకులు అప్రమత్తంగా ఉంటూ అబద్ధాల్ని ఎప్పటికప్పుడు ఖండించే కర్తవ్యాన్ని చేపట్టాయి. తప్పుడు కథనాల్ని ఖండించి అసలు నిజాలు చెప్పడానికి ప్రత్యేకమై విభాగాల్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
ఈ విభాగాలు చాలా అప్రమత్తంగా, వేగంగా పని చేసినందునే కిసాన్‌ర్యాలీ మీద సాగిన తప్పుడు కథనాల ప్రసారాన్ని అడ్డుకోగలిగాయి. దీప్‌సిద్దు బిజెపి అనుయాయి అనే నిజాన్ని చెప్పగలిగాయి. జాతీయజెండాకు రైతులు ఎలాంటి అవమానం చేయలేదని సాధికారికంగా నిరూపించాయి. నిజానికి కిసాన్‌ర్యాలీలో రైతుల చేతుల్లో మువ్వన్నెల జెండా ఎగురుతూ కనిపించిన దృశ్యాలు ఎన్నో. ఎర్రకోట చెంతకు చేరిన రైతుల చేతుల్లోనూ త్రివర్ణ పతాకాలు కనిపించాయి. వారి దేశభక్తికి తార్కాణంగా నిలిచే ఈ త్రివర్ణ పతాకాల గురించి టీవీ చానళ్ళు ఘనంగా చెప్పొచ్చు. కానీ అవి ఆ పని చేయలేదు.
 

అబద్ధాల కట్టడి
బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చాక నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు ఎక్కువగా చెలరేగుతున్నాయి. 370 ఆర్టికల్‌ రద్దు సమయంలో, సిఏఏ వ్యతిరేక ఆందోళనల పర్వంలోనూ వక్రీకరణలతో కూడిన వార్తలే ఎక్కువగా వ్యాపించాయి. 370 ఆర్టికల్‌ రద్దయిన వెంటనే కాశ్మీర్‌లో ఊరేగింపులు జరిగినా, అవి జరగనే లేదన్నట్లు ప్రభుత్వం మాట్లాడింది. కానీ ఆ ఊరేగింపుల దృశ్యాలని బిబిసి సాక్ష్యాధారాలతో సహా చూపింది. సిఏఏ వ్యతిరేక ఆందోళనల సందర్భంలోనూ వక్రీకరణలకు పాల్పడిన కార్పొరేట్‌ మీడియా కథనాల కుటిలత్వాన్ని ప్రత్యామ్నాయ మీడియా నిజానిజాలతో నిరూపించింది. అలాగే తబ్లిగ్‌ల కారణంగా కరోనా ముప్పు పెరుగుతుందనే వార్తలు ఎంత అబద్ధమో కాలక్రమేణా తెలిసి వచ్చింది.
ఈవిధంగా నిజాల్ని వక్రీకరించే ధోరణులు మీడియాలో ప్రబలుతున్నాయి. అయితే వక్రీకరణల్ని అంతే వేగంగా ఖండించే యంత్రాంగం పదునెక్కుతున్నది. ప్రజానుకూలశక్తుల ప్రత్యామ్నాయ మీడియా మరింత వేగంగా స్పందిస్తున్నది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజాల్ని వెల్లడించిన తీరు ఇందుకు నిదర్శనం. అయితే నిజాలు చెప్పడమే కాదు, అబద్ధాల ఖండన ప్రజాపక్షం నిలిచే మీడియా కర్తవ్యంగా పరిణమించడం అదనపు బాధ్యత. కాని నిర్వహించక తప్పని కర్తవ్యం. ఇదే సమయాన కార్పొరేట్‌ మీడియా స్వభావాన్ని, కౌటిల్యాన్ని మరింతగా జనాలకు తెలియజెప్పడం ప్రజాసంఘాల కార్యాచరణలో అంతర్భాగం కావాలి. ఎందుకంటే అసలు నిజాలు ఏమిటో తొలుత తెలియాల్సింది ప్రజలకే. కనుక అబద్దాల వేదికలుగా మారిన టీవీ చానళ్ళ, పత్రికల బండారం బయటపెట్టాలి. ఎందుకంటే అబద్ధాల కట్టడి నిజమైన వార్తలకు వెలుగుబాట. ఈ దారి ఎంతగా చదును చేస్తే అంతగా నిజాలు నలుదిశల పరివ్యాప్తమవుతాయి.

వక్రీకరణలు చెల్లవు

 

గుడిపాటి 

సెల్‌: 94900 99327