Aug 26,2023 21:00

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ మోహన్‌

ప్రజాశక్తి-కర్నూలు లీగల్‌
వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. శనివారం కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కర్నూలులో రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు. వీటికి అదనంగా అవసరంలో ఉన్న ప్రజలకు న్యాయం చేసేందుకు వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ కూడా చేరిందన్నారు. కేసుల పరిష్కారంలో ట్రిబ్యునల్‌, సభ్యులకు బార్‌ మెంబర్స్‌ తగిన సహకారం అందించాలని కోరారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ, సంబంధిత అంశాల్లో సమర్థవంతంగా న్యాయం అందించాలన్నదే వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ అంతిమ లక్ష్యమని తెలిపారు. అందరి సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ... కర్నూలులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయాన్ని, లోకాయుక్తను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ కోర్టు ఏర్పాటయినందుకు జిల్లావాసిగా సంతోషిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, ఇక్కడే వివాదాలు పరిష్కరించబడతాయని తెలిపారు. కోర్టులకు మౌలిక సదుపాయాల విషయంలో గతంలో కంటే మెరుగ్గా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని, న్యాయవాదులు ఈ టెక్నాలజీని బాగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. న్యాయ సంబంధిత అన్ని అంశాల్లో బార్‌, బెంచ్‌ సమన్వయంతో పని చేయాలని సూచించారు. కర్నూలు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌, సెషన్స్‌ జడ్జి ఎన్‌.శ్రీనివాస రావు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత సెక్షన్‌ 83(1) ప్రకారం జిఒ నెంబర్‌ 16 జారీ చేస్తూ కర్నూలు జిల్లాలో రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ కోర్టును ఏర్పాటు చేసి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ట్రిబ్యునల్‌లో రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ జి.భూపాల్‌ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ మెంబర్‌గా నాగేశ్వర రావు, అబ్దుల్‌ మజీద్‌ వ్యవహరిస్తారని చెప్పారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎఎమ్‌డి.ఇంతియాజ్‌ మాట్లాడుతూ... వక్ఫ్‌ అనేది ముస్లిం చట్టం ద్వారా గుర్తించబడిన మతపరమైన, పవిత్రమైన ధార్మిక ప్రయోజనాల కోసం కదిలే లేదా స్థిరాస్తి అని తెలిపారు. వక్ఫ్‌ ఆదాయాన్ని విద్య, అభివృద్ధి, సంక్షేమం, ముస్లిం చట్టం ద్వారా గుర్తించబడిన ఇతర ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌ జి.భూపాల్‌ రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి/సీనియర్‌ సివిల్‌ జడ్జి సిహెచ్‌.వెంకట నాగ శ్రీనివాస రావు, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ సభ్యులు హాబీజ్‌ డాక్టర్‌ అబ్దుల్‌ మస్జిద్‌, డిఆర్‌ఒ ఎస్‌వి.నాగేశ్వరరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభా దేవి, జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కల్యాణి పాల్గొన్నారు.