ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కార్యచరణ వేగవంతం చేసినట్టు వక్ఫ్ బోర్డ్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఆరిఫ్ వెల్లడించారు. గురువారం జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్‌స్పెక్టర్ షఫీ, సబార్డినేట్ రసూల్ జానీ, జిల్లా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్లతో కలిసి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ఉన్న కొన్ని స్థలాలను, మసీదులను ఆయన పరిశీలించారు. వాటి వివరాలను సేకరించారు. మసీదుల నిర్వహణ, ఆర్థికపరమైన లావాదేవీలు, ప్రభుత్వం నుంచి అందుతున్న ఇమామ్ మౌజన్ గౌరవ వేతనాలు వంటి విషయాలను ఆరా తీశారు. వక్ఫ్ బోర్డు భూములను ఆదాయ వనరులుగా ఏ విధంగా ఉపయోగించాలి, అన్యాక్రాంతమైన భూములు ఏ విధంగా తిరిగి స్వాధీనం చేసుకుని పరిరక్షించాలన్న విషయాలపై ఒక సమగ్ర నివేదిక తయారు చేసి న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళతామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అన్యాక్రాంతమైన భూములను పరిరక్షించే అవకాశం లేకుండా వక్ఫ్ బోర్డ్ నియామకం సైతం చేపట్టలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న ముస్లిములకు ఇచ్చిన హామీల్లో భాగంగా వక్ఫ్ బోర్డ్ వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముస్లిం ధార్మిక సంస్థల నిర్వహణకు ఉపయోగపడాల్సిన వక్ఫ్ భూముల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ముస్లిం మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా సహకరించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్లు సత్తార్ బాషా, షేక్ బిజిలానీ, మహ్మద్ జఫ్ఫరుల్లా ఖాన్, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.










