తెల్లవాడేసిన చిక్కుముడుల్ని ఛేదించి
భిన్నత్వంలో ఏకత్వం సాధించి
అమరవీరుల త్యాగాల పునాదులపై
నవ భారతాన్ని నిర్మించి
ప్రపంచ దేశాలతో పోటీపడుతూ
ఎన్నెన్ని పరుగులు పెడుతున్నా..
వజ్రోత్సవపు సంబరాల్లో మునిగితేలుతున్నా..
ఆ మువ్వన్నెల జెండా నీడలో
ఇంకా కడుపు నిండని దేహాలెన్నో
దేహీ అని అర్థిస్తూనే ఉన్నారు
గూడులేని బతుకులెన్నో
మురికి కాల్వలతో గోడెళ్ళబోసుకుంటున్నారు
ఆరడుగుల శరీరానికి
కనీసం గుడ్డముక్క కరువై
బజారునపడి బతుకీడుస్తున్నారు
దూరాలన్నీ దగ్గరై
ప్రపంచం కుగ్రామమైపోయినా
పలకా బలపం భారమై
అక్షరాలు అందనంత దూరమై
చదువుకు నోచుకోని బాల్యాలెన్నో బోరుమంటున్నారు
పాత గుండెల్ని తీసిపారేసి
కొత్త గుండెల్ని
అమర్చడం అలవాటైనా
సామాన్యుడికి జబ్బొస్తే
దవాఖానా
దయ చూపక
ప్రాణాలెన్నో
గాల్లో కలిసిపోతున్నారు
రాజ్యాలేలుతున్న రాజుల్లారా
మమ్మల్ని సామంత రాజుల్ని
చేయనవసరం లేదు సుమా!
కనీసం కూడు గూడు గుడ్డనిచ్చి,
చదువులు నేర్పించి, వైద్యం చేయించి
మా బతుకులు బాగుచేయండి చాలు!
యం. యస్. రాజు
95020 32666